వసివాడుతున్న పసి మొగ్గలు

2 Oct, 2019 08:43 IST|Sakshi
రక్త హీనతతో మృతిచెందిన కొండమ్మ(ఫైల్‌) 

2015 నుంచి 18 వరకు 115 మంది చిన్నారులు మృతి

 ఏజెన్సీలోని 18 గ్రామాల్లో దయనీయ పరిస్థితులు

 పోషకాహార లోపమే ప్రధాన సమస్య

సాక్షి, విశాఖపట్నం : పోషకాహార లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది.  పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేక చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.  గర్భిణులు రక్త హీనతతో వ్యాధుల బారిన పడుతున్నారని వివిధ సంస్థల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే.. ఈ సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు ఎక్కువగానే ఉన్నారని స్పష్టమవుతోంది. చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ(క్రై) అనే స్వచ్ఛంద సంస్థ విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో సర్వే నిర్వహించింది. శైశవ దశనుంచే చిన్నారులకు పోషకాహారం అందిస్తేనే సరైన ఎదుగుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. సాధారణంగా శిశువు జన్మించినప్పుడు 2.5 కిలోల  కంటే ఎక్కువగా బరువు ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. కానీ. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో జన్మిస్తున్న వారి శాతం 5.7గా ఉంటే విశాఖలో దాదాపు 4.2 శాతంగా ఉంది. 5 ఏళ్లలోపు వయసుకి తగ్గ బరువు ఎదగలేకపోతున్న వారి శాతం రాష్ట్రంలో 31.9గా ఉంటే విశాఖలో దాన్ని మించి పోయి ఏకంగా 33.1శాతంగా ఉంది. 

ఐదేళ్లు నిండకుండానే నూరేళ్లు 
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులు  తీవ్రమైన పోషకాహార సమస్య బారిన పడుతున్నారు. చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015 నుంచి 2018 మధ్య  18 గిరిజన గ్రామాల్లో 115 మంది చిన్నారులు పోషకాహారలోపం, రక్త హీనతతో బాధపడుతూ మరణించారని పేర్కొంది. వీరంతా 0 నుంచి 5 సంవత్సరాల్లోపు శిశువులే కావడం శోచనీయం. ఈ సంస్థ 18 గ్రామాల్లో చేసిన సర్వేలో కొన్ని ఆందోళనకరమైన అంశాలు కూడా వెల్లడయ్యాయి. ఐసీడీఎస్‌ నివేదిక ప్రకారం చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో ఈ తరహా చిన్నారులు 165 మంది అతి తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతుండగా 87 మంది చిన్నారులు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నట్టుట్టు గుర్తించారు. 25 మంది ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. 

మహిళా లోకమా.. మన్నించు...
అవనిలో సగమని చెబుతున్న అతివల ఆరోగ్య విషయంలో టీడీపీ సర్కారు ఆది నుంచి చిన్నచూపు చూసింది. ముఖ్యంగా రక్తహీనత సమస్య మహిళల్లో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో చూస్తే గతేడాది 56 శాతంగా ఉన్న రక్తహీనత మూడేళ్లలో 60 శాతానికి చేరుకుంది. మహిళల ఆరోగ్యంపై జీవిత కాలం ప్రతికూల ప్రభావం చూపుతోంది. పౌష్టికాహారం సరిగా అందకపోవడంతో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. రక్త హీనతతో బాధపడుతున్న మహిళల శాతం రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో ఎక్కువగా ఉంది. 2015 నుంచి 2018 కాలంలో 35 ప్రసూతి మరణాలు సంభవించాయని చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ సర్వేలో వెల్లడైంది.

ప్రాణాలు కాపాడని పథకాలు 
వాస్తవంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో.. ఈ తరహా సమస్యలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే  ఏజెన్సీలో సరైన పౌష్టికాహారం అందించేందుకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపించింది. అన్న అమృత హస్తం, గిరి గోరు ముద్ద, బాలసంజీవని పేరుతో.. అనేక పథకాలు అమలు చేసినా.. అవేవీ చిన్నారుల ప్రాణాలు కాపాడలేకపోయాయి.

దిద్దుబాటు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం 
గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఏజెన్సీ పాలిట శాపంలా మారిపోయింది. ఈ పరిస్థితి నుంచి గిరిజన గ్రామాల్ని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గిరిజన గ్రామాల్లో పోషకాహారలోపంతో మరణాలు, ప్రసూతి మరణాలు సంభవించకుండా ఉండేందుకు చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిపుత్రులకు 100 శాతం పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పోషణ్‌ అభియాన్‌ మొదలైన పథకాల ద్వారా పాలు, గుడ్లు, శనగ చెక్కీలతో పాటు ప్రతినెలా కిలో ఖర్జూరం, రాగిపిండి, బెల్లం మొదలైన పౌష్టికాహారం అందిస్తోంది. దీనికితోడు కొత్త పథకాలు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం 
చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, మహిళల్లో ఐరన్‌ లోపాల్ని అధిగమించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికీ పౌష్టికాహారం అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల్లో రక్త హీనతల్ని, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
– సీతామహాలక్ష్మి, జిల్లా మహిళా శిశు, అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌

ప్రొటీన్‌ లోపం వల్లే మరణాలు 
2015–18 మధ్య కాలంలో పౌష్టికాహార లోపం 0–6 సంవత్సరాల్లోపు చిన్నారుల్లో ఎక్కువగా ఉన్నట్లు మేము చేసిన సర్వేలో తేలింది. అలాగే గర్భిణులు, బాలింతల్లో కూడా అధికంగా కనిపించింది. సరైన ప్రొటీ æన్‌ అందకపోవడమే దీనికి ప్రధాన కారణం. అతి తక్కువ నాణ్యత ఉన్న రేషన్‌ను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి. కొత్త ప్రభుత్వం దీన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలి.
– జాన్‌ రాబర్ట్స్, చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ ప్రోగ్రామ్‌ హెడ్‌.

>
మరిన్ని వార్తలు