మథనం

1 Jun, 2014 00:03 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పార్టీ అధినేత ఆదేశానుసారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలవారీ సమీక్షలలో భాగంగా జిల్లాలో సమీక్షకు త్రిసభ్య కమిటీ ఆదివారం శ్రీకారం చుట్టనుంది. కమిటీ సభ్యులైన కొలుసు పార్థసారథి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గొట్టిపాటి రవికుమార్ జిల్లాకు రానున్నారు. ఆదివారం నరసరావుపేట లో, సోమవారం గుంటూరులో సమీక్షలు జరుగుతాయి. జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల జయాపజయాలపై ఈ సమీక్షలు జరగనున్నాయి.  ఈ సమావేశాల నిర్వహణకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ జిల్లాకు రానున్నది.
 
 మాజీ మంత్రి కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వీటిని నిర్వహించనున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. జూన్ 1వ తేదీ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై నరసరావుపేటలోని శుభం కల్యాణ మండపంలోనూ, జూన్ 2వ తేదీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మంట్లపై సమీక్ష నిర్వహిస్తారు.
 
 పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోటీ చేసిన అభ్యర్ధుల నుంచి అభిప్రాయాలను ఈ కమిటీ తీసుకోనున్నది. పార్టీలోని నాయకులు తమకు సహకరించలేదని కొందరు అభ్యర్థులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన సమయంలో ఫిర్యాదు చేశారు. అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల నిర్వహణలోని లోపాలపై కార్యకర్తలు కమిటీ ఎదుట తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేకపోలేదు. సమీక్షల్లో ఎంపీ అభ్యర్థులు బాలశౌరి, అయోధ్యరామిరెడ్డి, జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు  హాజరుకానున్నారని జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు