ఒంటమిట్ట: అధికారులపై సీఎం అసహనం

31 Mar, 2018 11:20 IST|Sakshi

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా తీవ్ర అపశ్రుతి చోటుచేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సమయంలో భారీ వర్షం కురువడంతో నలుగురు మృతిచెందారు. మరో 80 మంది దాకా గాయాల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడు–సీతమ్మల వివాహం సందర్భంగా వెలుగులతో కళకళలాడాల్సిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వరుణదేవుడి ప్రతాపానికి అంధకారంగా మారింది. శుక్రవారం ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వెనువెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన మొదలైంది. గంటకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఒకవైపు విపరీతమైన గాలులు, మరోవైపు ఉరుముల శబ్దాలతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఫోకస్‌ లైట్ల స్తంభాలు, డెకరేషన్‌ లైట్లతో అలంకరించిన బొమ్మలు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. చలువ పందిళ్లకు వేసిన టెంట్లు, రేకులు కూడా లేచిపోయాయి.  వడగండ్లు రేకులపై పడుతుండడంతో భక్తులు భయకంపితులయ్యారు. కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న వేపచెట్లు నేలకూలగా, అక్కడే ఉన్న చలువ పందిరి కూలిపోయింది.  అధికారులు వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో అంధకారం నెలకొంది.  

ప్రాణాలు తీసిన లైట్లు: ఆలయ సమీపంలో కల్యాణోత్సవం వేదిక రేకులు కూలిపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. బద్వేలు ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య(48) మృతి చెందాడు. ఫోకస్‌ లైట్లు మీద పడడంతో పోరుమామిళ్లకు చెందిన చెంగయ్య(70) అనే వృద్ధుడు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఒంటిమిట్టకు చెందిన వెంకట సుబ్బమ్మ(65) అనే భక్తురాలు దక్షిణ గోపురం వద్ద కొయ్యలు మీదపడటంతో మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి చెందిన మీనా(45) రాములోరి కల్యాణానికి వచ్చి గాయపడి, తుదిశ్వాస విడిచారు. వడగళ్ల వానకు రేకులు గాలికి లేచి పడడం, విరిగిన చెట్లు తగలడం, డెకరేషన్‌ లైట్లు మీదపడడం వంటి కారణాలతో దాదాపు 80 మంది గాయపడ్డారు. అందులో 25 మందిని కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐదుగురిని తిరుపతికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 సమయంలో విద్యుత్‌ నిలిపివేయడంతో అప్పటి నుంచి రాత్రి 9.30 వరకు ఆలయం అంధకారంలోనే ఉండిపోయింది. 

మరిన్ని వార్తలు