హంద్రీ నీవాను తాగునీటి పథకంగా మార్చే కుట్ర

1 Aug, 2015 02:53 IST|Sakshi
హంద్రీ నీవాను తాగునీటి పథకంగా మార్చే కుట్ర

- చంద్రబాబు తీరుపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
- సర్కారు వైఖరికి నిరసనగా 3న ఉరవకొండలో రైతు సదస్సు
అనంతపురం సెంట్రల్ :
హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని మరోమారు తాగునీటి పథకంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నాడని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు కోసం ఉరవకొండ నియోజకవర్గంలో వేలాది మంది రైతులు వారి భూములను కోల్పోయారన్నారు. గత ప్రభుత్వ హాయంలోనే 96శాతం హంద్రీనీవా మొదటి దశ పూర్తయిందని, మూడేళ్లుగా జిల్లాకు నీళ్లొస్తున్నాయన్నారు. కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే తొలిదశలోని 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చునని వివరించారు.

అయితే ప్రభుత్వానికి ఆయకట్టుకు నీరివ్వాలనే ద్యాసే లేదని మండిపడ్డారు. ఎంతసేపూ చిత్తూరు జిల్లాలోని సీఎం సొంతనియోజకవర్గం కుప్పంకు నీటిని తరలించుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా 1 టీఎంసీ మాత్రమే కేటాయింపు ఉన్న కుప్పంకు 2 టీఎంసీలకు పెంచారని గుర్తు చేశారు. అయితే మొదటి దశలోని ఆయకట్టును కాదని రెండదశలో చివరనున్న చిత్తూరు జిల్లాలకు నీటిని తీసుకుపోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాలువగట్లు తెంచైనా సరే ఆయకట్టుకు నీరు విడుదల చేసుకుంటామని హెచ్చరించారు.

గతంలో ఎన్‌టీరామారావు సాగునీటి పథకంగా ప్రారంభిస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు 5.5 టీఎంసీల తాగునీటి పథకంగా కుదించారని గుర్తుచేశారు. 2004లో అధికారం చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 40 టీఎంసీల సాగు,తాగునీటిప్రాజెక్టు మార్చారని వివరించారు. గడిచిన 18 ఏళ్లలో 14 సార్లు జిల్లాలో కరువు వ స్తే ఈ జిల్లా ప్రజలు ఎలా తట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు నగలు, ట్రాక్టర్లను వేలం వేసి రైతులను అవమానానికి గురి చేస్తున్నారని అన్నారు.

పుష్కరాలకు రూ. 1600 కోట్లు, పట్టిసీమకు రూ. 1000 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను అందించిన అనంతపురం జిల్లా ప్రజల కోసం హంద్రీనీవాకు నిధులు విడుదల చేసి ఆయకట్టుకు నీరిస్తే ఆత్మహత్యలే ఉండవని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక 14 నెలల సమయంలో హంద్రీనీవాకు ఎంత ఖర్చు చేశారు? ఎన్ని ఎకరాలకు నీరిచ్చారు? కనీసం కరెంటు బిల్లులైనా కట్టారా? అని ప్రశ్నించారు. ఎంతసేపు అరకొరగా చెరువులకు నీరిచ్చి జిల్లా మంత్రులు ‘షో’ చేస్తున్నారని విమర్శించారు. పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న 50 వేల ఎకరాలు ఆయకట్టు అభివృద్ది గురించి పట్టించుకున్నారా? ప్రశ్నించారు.

సర్కారు ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా ‘హంద్రీనీవా ఆయకట్టు నీటి సాధన సమితి’ ఆధ్వర్యంలో  3న ఉరవకొండలో రైతు సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపక్షాల నుంచి మద్దతు వస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రజలు, అన్ని రాజకీయపార్టీల నాయకులు, మేదావులు, ప్రముఖులు విచ్చేసి రైతుసదస్సును విజయవంతం చేసి జిల్లా ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలిసొచ్చేలా గళం వినిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు