మీరూ ఆ గ్రామాల్లోనే బస చేయండి

11 May, 2020 03:29 IST|Sakshi
విశాఖ జిల్లా ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలో ఇంటిని శుభ్రం చేసుకుంటున్న ఓ మహిళ

మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం 

బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులు మెరుగుపర్చాలి

వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకూడదు

విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై అధికారులకు సీఎం ఆదేశాలు

పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరినీ సోమవారం సాయంత్రానికి ఇళ్లకు చేర్చేలా చూడాలి. ప్రజలకు ధైర్యాన్ని కల్పించేందుకు ఆయా గ్రామాల్లోనే మంత్రులు బస చేయాలి. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారాన్ని అందజేయాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: విశాఖ దుర్ఘటనకు సంబంధించి సోమవారం సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులను ఆదేశించారు. ప్రజలకు ధైర్యాన్ని కల్పించేందుకు ఆయా గ్రామాల్లోనే మంత్రులు బస చేయాలన్నారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారాన్ని ఆదివారం అందజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు సోమవారం పరిహారం అందించాలని ఆదేశించారు. మిగిలిన వారికి కూడా ప్రకటించిన విధంగా సాయం అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదివారం తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.  

సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 
► ఎల్‌జీ కంపెనీలో గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు చేపట్టిన చర్యల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
► బాధితులు కోలుకుంటున్న వైనం, చికిత్స అందుతున్న తీరును అధికారులు వివరించారు. 
► గాలిలో గ్యాస్‌ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని అధికారులు తెలిపారు. దీనిపై నిపుణులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారని వివరించారు.  
► కంపెనీకి సమీపంలోని గ్రామాల్లో స్టైరీన్‌ గ్యాస్‌ అవశేషాలను తొలగించేందుకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు.  
► గ్రామాల్లో ముమ్మరంగా పూర్తి స్థాయిలో శానిటేషన్‌ నిర్వహించాలని, అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాతే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
► బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలన్నారు. 
► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరే వరకు ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని, వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని సూచించారు.
► తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
► ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం కోసం ప్రజలూ ఎక్కడా తిరగకుండా పారదర్శకంగా గ్రామ వలంటీర్ల ద్వారా నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందించాలని ఆదేశించారు.
► ప్రమాదానికి కారణమైన స్టైరీన్‌ను విశాఖ నుంచి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు