రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ... మరో ఆరు జిల్లాలకు

14 Jul, 2020 04:41 IST|Sakshi

వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వర్తింపు

ఈ నెల 16వ తేదీ నుంచి అమల్లోకి

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

మొత్తంగా 2,200 చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి

సాక్షి, అమరావతి: రూ.వెయ్యి దాటిన వైద్యం ఖర్చును ఆరోగ్యశ్రీ పథకం వర్తింపులో భాగంగా మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతోన్న ఈ పథకం ఈ నెల 16వ తేదీ నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున సోమవారం సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. మరో ఆరు జిల్లాల్లో అమలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.

ఎన్నికల సమయంలో హామీ
వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ హామీని అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు 2020 జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇందులో భాగంగా అప్పటి వరకూ ఉన్న 1,059 చికిత్సలకు మరో వెయ్యి చేర్చి 2,059 చికిత్సలకు ఆరోగ్యశ్రీని వర్తింప చేశారు. ప్రస్తుతం చికిత్సల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద 54 క్యాన్సర్‌ చికిత్సలనూ చేర్చారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 

గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింప చేసేవారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతో వైద్యం అందని పరిస్థితి. వీటిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకూ రూ.1,815 కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి, మరో రూ.315 కోట్లు ఈహెచ్‌ఎస్‌ (ఉద్యోగుల వైద్యపథకం) కింద ఈ ప్రభుత్వం చెల్లించింది. 

>
మరిన్ని వార్తలు