వారికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది: సీఎం జగన్‌

13 Aug, 2019 20:42 IST|Sakshi

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

డిసెంబరు 21నుంచి హెల్త్‌కార్టుల జారీ

అక్టోబరు 10 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు

ప్రమాణాలు, సౌకర్యాల ఆధారంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల కేటగిరీ

కొనుగోలు చేసిన మందుల్లోనాణ్యత ఉండాలి

జూన్‌ 2022 నాటికి మొత్తం ఆస్పత్రులన్నీ పూర్తిగా మెరుగుపడాలి

రాష్ట్రం వెలుపలా ఆరోగ్యశ్రీ సేవలు

నవంబరు మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పూర్తిస్థాయి సదుపాయాలతో ఐదు క్యాన్సర్‌ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లాలో, విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలలో క్యాన్సర్‌ ఆస్పత్రులను నిర్మిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ రీసెర్చ్‌ ఆస్పత్రి, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్‌ కాలేజీలు స్థాపిస్తామని వెల్లడించారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వీటికి శంకుస్థాపనలు చేస్తామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ...‘ 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండాలి. కనీసం ఆరు సంవత్సరాలకు ఒకసారి వాహనాలను మార్చాలి. వేయి వాహనాలను ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి సెప్టెంబరులో టెండర్లు ఖరారు చేయాలి. అర్హులైన ప్రతి కుటుంబానికీ హెల్త్‌ కార్డు, క్యూఆర్‌ కోడ్‌తో కార్డుల జారీ చేస్తాం. కార్డు స్కాన్‌  చేయగానే ఆ కార్డుదారునికి ఓటీపీ నంబర్‌ వస్తుంది. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి. అదే విధంగా 104 వాహనాల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. తద్వారా ఎవరైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది వైద్యులకు  సులభంగా తెలుస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్య శ్రీ ద్వారా సుమారు సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నాం. డిసెంబర్‌ 21 నుంచి కార్డుల జారీ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.

సౌకర్యాల ఆధారంగా కేటగిరీ
‘నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో నాణ్యత ఉండాలి. ప్రమాణాలు పాటిస్తున్న, సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులు ‘‘ఏ  ప్లస్‌’’ , ‘‘ఎ’’ కేటగిరీలో...లోపాలున్న ఆస్పత్రులను ‘‘బి’’కేటగిరీలో ఉంచి వారికి కొంతకాలం గడువు ఇవ్వాలి. మళ్లీ తనిఖీలు చేసినప్పుడు అవే లోపాలు బయటపడితే వాటిని నెట్‌వర్క్‌ జాబితా నుంచి తొలగించాలి. ప్రమాణాలు, సౌకర్యాలు లేని ఆస్పత్రులను కేటగిరీ ‘‘సి’’లో చేర్చి వాటిని జాబితా నుంచి పూర్తిగా తీసివేయాలి. ప్రతి గ్రామ సెక్రటేరియలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితా ఉంచాలి. అర్హతలున్న ఆస్పత్రులు ఏవైనా సరే.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రులను ‘‘ఏ ప్లస్‌’’  కేటగిరీలోకి తీసుకురావాలి. సెప్టెంబరు నుంచి నెట్‌వర్క్‌ ఆస్పత్రుల తనిఖీలు ప్రారంభించాలి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీలోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో దానికి కిందకు వచ్చే జబ్బుల జాబితాను కూడా తయారు చేయాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. అదే విధంగా నవంబర్‌ మొదటివారం నుంచి రాష్ట్రం వెలుపల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైల్లోని సుమారు 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు  అందుబాటులోకి సేవలు తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

వైఎస్సార్‌ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం
‘కొనుగోలు చేసిన మందుల్లో నాణ్యత ఉండాలి. ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు, పరికరాలు, సిబ్బంది, మౌలిక సదుపాయాల వారీగా ప్రాథమ్యాలను గుర్తించండి. ప్రతీ నియోజకవర్గం లేదా మండలంలో మొదట దశలో ఒక ఆస్పత్రిని అభివృద్ధి చేయండి. మందుల కోసం, రక్త పరీక్షల కోసం ఎవ్వరూ కూడా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఏ పరికరం కొనుగోలు చేసినా నిర్వహణ, మరమ్మతుల కోసం ఇబ్బంది పడకూడదు. పరికరాల కొనుగోలు విషయంలో టెండర్లలో నిర్వహణ కూడా ఒక షరతుగా ఉండాలి. వైద్య పరికరాల సమర్థ నిర్వహణకు విభాగాన్ని ఏర్పాటు చేయండి. దీనివల్ల ప్రతి ఆస్పత్రిలో పరికరాలు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సెప్టెంబరు, 2021 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాలన్నీ ఉండాలి. జూన్‌ 2022 నాటికి మొత్తం ఆస్పత్రులన్నీ పూర్తిగా మెరుగుపడాలి. టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులు బాగుచేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేశారు. 2020 డిసెంబర్‌ నాటికి టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను బాగుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిసెంబర్‌ 2021 నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇక హెల్త్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణం జూన్‌ 2022 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.

కాగా ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితా తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ జాబితాలో ఇప్పుడున్న వ్యాధుల సంఖ్య  రెట్టింపు కానుంది. తద్వారా 2వేలకుపైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స  చేయించుకునే వెసలుబాటు కలుగనుంది. ఇక జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ  వర్తింపు చేయనున్నారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మూడు నెలలపాటు పథకం అమలును అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత దీనిని క్రమంగా అన్నిజిల్లాలకు వర్తింపు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా...అక్టోబరు 10 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్లు అవసరమైన వారు, కంటి అద్దాలు అమర్చాల్సిన వారిని గుర్తించి.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వారికి ఆపరేషన్లు, అద్దాల పంపిణీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు