రూ.596 కోట్లతో విశాఖలో కాఫీ ప్లాంటేషన్

3 Apr, 2015 19:21 IST|Sakshi

విశాఖపట్నం : దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో రూ.596కోట్ల అంచనా వ్యయంతో ఒకేసారి లక్ష ఎకరాల్లో భారీఎత్తున కాఫీ ప్లాంటేషన్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు.

శుక్రవారం విశాఖ జీసీసీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అటవీ విస్తీర్ణత 33 శాతం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏపీలో కేవలం 24 శాతం మాత్రమే ఉందనీ, అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టు కూడా ఇందులో భాగమేనన్నారు. కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టు కోసం సగం నిధులు ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి సమకూర్చుతుండగా, మిగిలిన సగం నిధులు కాఫీ బోర్డు సబ్సిడీ రూపంలో అందజేస్తుందన్నారు.

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది గిరిజనులకు ఉపాధి లభించనుందన్నారు. ఇంత భారీ ఎత్తున ప్లాంటేషన్ చేపట్టడం దేశంలోనే ఇదే తొలిసారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది గిరిజన సబ్‌ప్లాన్ కోసం రూ. 1900 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

మరిన్ని వార్తలు