పోలీస్‌స్టేషన్‌ సాక్షిగా.. వసూళ్ల దందా

9 Nov, 2017 11:03 IST|Sakshi

అగ్రిగోల్డ్‌ బాండ్లు పరిశీలనలో ప్రైవేటు వ్యక్తుల చేతివాటం

ఒక్కో బాధితుడి వద్ద రూ. 50 నుంచి 100 రూపాయల వసూలు

గందరగోళంగా బాండ్లు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ

అగ్రిగోల్డ్‌ బాధితులకు కష్టాలు వెంటాడుతున్నాయి. అవసరాలు తీరుతాయని రూపాయి..రూపాయి కూడగట్టి అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయిన బాధితులను కొంతమంది వ్యక్తులు మరో రకంగా దోచుకుంటున్నారు. బాండ్ల పరిశీలన కోసం పోలీసుస్టేషన్లకు వస్తున్న వారి నుంచి రూ. 50 నుంచి వంద రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. దాచుకున్న సొమ్ము వస్తుందనే ఆశతో బాధితులు కాదనలేక డబ్బులను చెల్లిస్తున్నారు. టెక్కలి పోలీసుస్టేషన్‌ సాక్షిగా బుధవారం ఈ దందా వెలుగుచూసింది.

టెక్కలి: అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు చెందిన వివిధ రకాల పత్రాలను ఆన్‌లైన్‌ నమోదు పరిశీలన చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం డివిజన్‌ కేంద్రమైన టెక్కలి పోలీస్‌స్టేషన్‌ సాక్షిగా కొంత మంది వ్యక్తులు అక్రమ వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 50 నుంచి వంద రూపాయలు వసూలు చేసి పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కనిపించింది. పోలీస్‌స్టేషన్‌లోనే దందా జరగడంపై బాధితులు నివ్వెరపోయారు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులంతా తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.అగ్రిగోల్డ్‌ పత్రాల ఆన్‌లైన్‌ నమోదుకు గురువారంతో గడువు ముగిసే క్రమంలో టెక్కలి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసుస్టేషన్‌కు బుధవారం చె?రుకున్నారు.

అయితే స్టేషన్‌ లోపల అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, ప్రైవేట్‌ వ్యక్తులు కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని డిపాజిట్‌దారుల పత్రాలను ఆన్‌లైన్‌ నమోదు చేశారు. ఇందులో కొంత మంది వ్యక్తులు ఒక్కో బాధితుడి వద్ద రూ. 50 నుంచి 100 రూపాయలు వసూలు చేసి ఆన్‌లైన్‌ నమోదు చేయడం కనిపించింది. ఇప్పటికే విసిగిపోయిన బాధితులు ప్రైవేట్‌ వ్యక్తులు డిమాండ్‌ చేసిన డబ్బులు ఇచ్చి పత్రాలను ఆన్‌లైన్‌ నమోదు చేయించుకున్నారు. సాక్షాత్తు న్యాయాన్ని రక్షించాల్సిన పోలీస్‌స్టేషన్‌లో ఇటువంటి వసూళ్ల పర్వం జరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. మరో వైపు ముందుగా ఆన్‌లైన్‌ నమోదు కోసం పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన పత్రాలు గల్లంతు కావడంతో బాధితులు లబోదిబోమన్నారు.

మరిన్ని వార్తలు