అంగన్‌వాడీకేంద్రాలకు ఇంటర్‌నెట్, స్మార్ట్‌ టీవీలు

27 Oct, 2017 07:54 IST|Sakshi

కలెక్టర్‌ ప్రద్యుమ్న

ఐరాల : జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు, ఇంటర్‌ నెట్, స్మార్ట్‌ టీవీలు అందజేయనున్నట్లు కలెక్టర్‌ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం ఆయన మండలంలోని చుక్కావారిపల్లెలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,750 కేంద్రాలకు స్మార్ట్‌ టీవీలు అందజేయనున్నట్లు తెలిపారు. రూ 5 లక్షల ఎంపీ నిధులతో అరుంధతీయవాడల్లో ఉన్న 600 అంగన్‌వాడీ కేంద్రాలకు టీవీలు, ఇంటర్‌నెట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మిగిలిన వాటికి టెండర్ల ద్వారా అందజేస్తామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించడమే లక్ష్యమన్నారు.  వేదగిరివారిపల్లె పంచాయతీని ఉపాధి హమీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సింగం శెట్టి సుబ్బరామయ్య దత్తత తీసుకోవడం హర్షించదగిన విషయమన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఆయనకు ప్రజలు సహకరించాలన్నారు.

హరిజనవాడకు సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, పశువైద్య కేంద్రం మంజూరు చేయాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరగా, పంచాయతీలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించుకుంటే వాటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సింగంశెట్టి సుబ్బరామయ్యను కలెక్టర్‌ సన్మానించారు. అనంతరం సుబ్బరామయ్య ఆ పంచాయతీలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చిన టీవీలను అందజేశారు. ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మురళీధర్‌ మూర్తి , సర్పంచ్‌ వసంతమ్మ, మండల ఉపాధ్యక్షుడు ధనుంజయనాయుడు, తహసీల్దార్‌ ప్రసాద్‌ బాబు, ఇన్‌చార్జి ఎంపీడీఓ సతీష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు