ఊరంతా మా కుటుంబమే!

10 Oct, 2023 00:17 IST|Sakshi
∙పౌష్ఠికాహారం.. పంచుతూ..., రేగట్టె వెంకట రమణ

విధుల్లో ఉత్తమసేవలు అందించినందుకుగాను జాతీయ స్థాయి ఉత్తమ అంగన్‌వాడీ  టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం, రేగట్టె వెంకట రమణ ఎంపికయ్యారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి పురస్కారం అందుకోనున్నారు.   ఈ సందర్భంగా రేగట్టె వెంకటరమణను పలకరిస్తే తన ఇరవై మూడేళ్ల్ల కృషిని వివరించారు.

‘‘పై అధికారులు చెప్పిన పనిని సమయానుకూలంగా నూటికి నూరు శాతం పూర్తి చేస్తూ రావడం వల్లే ఈ రోజు ఈ పురస్కారం లభించింది. ఎనిమిదవ తరగతి పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఇరవై మూడేళ్ల్ల క్రితం అత్తింటిలో అడుగుపెడుతూనే అంగన్‌వాడీ టీచర్‌గానూ చేరాను. ఆ తర్వాత మా వారు భద్రయ్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. మా ఇంటినే కాదు ఊరు బాగోగులు చూసుకునే అవకాశం కూడా దక్కడం అదృష్టంగా భావిస్తాను.

అందుకే, నాకు మా ఊరే కుటుంబం అయ్యింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ తెలిసిపోతుంది. అందరూ అందరి కోసం అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలను జరుపుతుంటాం. ఇవన్నీ ఊళ్లో అందరినీ సంఘటితం చేస్తున్నాయి. ప్రీ స్కూల్, ఆరోగ్యలక్ష్మి, ఇంటింటి అంగన్‌వాడీ హోమ్‌ విజిట్స్, పౌష్టికాహార, తల్లిపాల వారోత్సవాలు, మిల్లెట్స్‌ మాసం, పిల్లల చదువుకు సంబంధించి.. ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం. ఏ కార్యక్రమం చేసినా నూరు శాతం సక్సెస్‌ అవుతుంది.

ఇంటింటి ప్రోగ్రామ్‌..
గర్భిణులపై ఎక్కువ ఫోకస్‌ పెడుతుంటాం. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం.. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్‌ ఇస్తాం. అలాగే పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంటాం. మేం మా డైరీలో సక్సెస్‌ స్టోరీలు కూడా నోట్‌ చేస్తాం. ఒకసారి ఒక గర్భిణి పౌష్టికాహారం గురించి, తీసుకోవలసిన ఇతర జాగ్రత్తల గురించీ మేం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోలేదు.

ఆమెకు డెలివరీ అయి బరువు తక్కువతో పాప పుట్టి, చనిపోయింది. అయినా ఆమెను మళ్ళీ మళ్లీ కలుస్తూనే, విషయాలన్నీ చెబుతూ ఆమె తిరిగి కోలుకునేలా చేశాం. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్‌ అయినప్పుడు మేం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించింది. ఈసారి ఆరోగ్యకరమైన పాపకు తల్లి అయ్యింది. ఆ తర్వాత ఆమెనే ఊళ్లో ఎవరు ప్రెగ్నెంట్‌ అయినా తనలా అశ్రద్ధ చేయద్దని సూచనలు చేస్తుంటుంది. చంటిపిల్లల విషయంలోనూ తల్లులు ఒకరిద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్‌ చేస్తుంటాం.

అందరూ మా వాళ్లే..
గర్భిణులకు సీమంతాలు, స్కూల్‌ డే, చిల్డ్రన్‌ డే వంటి కార్యక్రమాలకు గ్రామపెద్దలు డబ్బులు పోగేసి మరీ చేస్తుంటారు. ర్యాలీలు, వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ గ్రామపెద్దలను కలిసి చెబుతాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తాను. వాళ్లూ మిగతా అందరినీ కూడగట్టుకొని, మాకు మద్దతు ఇస్తారు. దీంతో ఊరంతా ఆరోగ్యంగా ఉండేలా సరైన కృషి జరుగుతోంది.

కార్యక్రమాల్లో ఊరంతా ఒక్కటవుతుంది. ఆ రోజు ఎవరూ పనులకు కూడా వెళ్లరు. కార్యక్రమాలను ఓ పండగలా జరుపుతుంటారు. నేను చెప్పిన విషయాలను వినడంలోనూ, ఆచరించడంలోనూ మా ఊరంతా నాకు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. కరోనా సమయంలోనూ తీసుకున్న జాగ్రత్తలకు రాష్ట్రస్థాయి అ«ధికారుల నుంచి ప్రశంసలు లభించాయి.

బెస్ట్‌ అవార్డీగా...
మండల, ప్రాజెక్ట్, జిల్లా స్థాయుల్లోనూ.. బెస్ట్‌ అంగన్‌వాడీ టీచర్‌గా అవార్డులు అందుకున్నాను. ఈ యేడాది జాతీయ స్థాయికి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిల్లెట్స్‌తో ఐటమ్స్‌ తయారుచేసి, డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తుంటాం. వాటి ప్రయోజనాలను వివరిస్తాం. దీనివల్ల ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి.

మా అంగన్‌వాడీ టీచర్స్‌కి నెలలో రెండు సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో ఊళ్లలో చేపట్టే కార్యక్రమాల వివరాలు పంచుకోవడం, ముందస్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడం, నిర్ణయాల అమలుకు కృషి చేయడం మాకున్న పెద్ద బాధ్యత. దీనిని సక్రమంగా నిర్వర్తించడమే ఈ రోజు మీ అందరి ముందు నిలిపింది’’ అని ఆనందంగా వివరించింది వెంకటరమణ.

 – నిర్మలా రెడ్డి

మరిన్ని వార్తలు