వైఎస్‌ సంక్షేమ పథానికి 15 ఏళ్లు

14 May, 2019 08:07 IST|Sakshi

ఆరోగ్యశ్రీ, ఫీజుల చెల్లింపు, జలయజ్ఞం పథకాలకు శ్రీకారం

ముస్లింలకు 4% రిజర్వేషన్లు

కుల, మత, వర్గ, ప్రాంతీయ వివక్ష లేకుండా పథకాల అమలు

ఇదే ఆలోచనతో ప్రజల్లోకి వైఎస్‌ జగన్‌ కూడా..

మే 23 తర్వాత దేదీప్యమానంగా మహానేత సంక్షేమ యుగం

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగునాట కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి జనహిత కార్యక్రమాలకు జీవ ప్రదాతగా.. చిరస్మరణీయంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 1,400 కిలోమీటర్ల పైబడి ఆయన చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలు.. ప్రజల ఈతి బాధలను స్వయంగా చూసిన వైఎస్‌.. అధికారంలోకి వచ్చీ రాగానే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేశారు.  నాటికి రైతులు బకాయీ పడి ఉన్న రూ.1,250 కోట్ల విద్యుత్‌ బిల్లులను కూడా రద్దు చేశారు.

పాలించింది కొన్నేళ్లే అయినా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ పాలించింది ఐదేళ్ల మూడు నెలలే అయినప్పటికీ పాలనపై తనదైన ముద్రవేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలుచేయడం ఒక ఎత్తయితే ఇవ్వని వాగ్దానాలను సైతం అమలుచేయడం ఆయన ఘనతగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినదే. ఈ పథకం కింద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకునే అవకాశం పేదలకు కలిగింది. 

చదువుకు భరోసా..
ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ మరో విప్లవాత్మకమైన పథకంగా నిలిచింది. నేటికీ లక్షలాది మంది విద్యార్థులు తమ చదువులను నిరాఘాటంగా కొనసాగించగలుతున్నారంటే వైఎస్‌ తన పాలనలో ఇచ్చిన భరోసాయే కారణం. ఇక ముస్లింలకు తన హయాంలో 4 శాతం విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

నేటి జలఫలాలు వైఎస్‌ చలవే
వైఎస్‌ సంకల్పించిన మరో అద్భుతమైన పథకం జలయజ్ఞం. ఆయన హయాంలో చిన్నా, చితకా 48 ప్రాజెక్టుల వరకూ ఎంపిక చేసి వాటన్నింటినీ సాకారం చేయాలని సంకల్పించారు. నాడు ఆయన వేసిన పునాదులు, 80 శాతం వరకూ చేసిన వివిధ ప్రాజెక్టులూ నేటికి పూర్తయి జలఫలాలను ఇస్తున్నాయి. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కుల, మత, వర్గ, ప్రాంతీయ వివక్ష లేకుండా అందరికీ వర్తించేలా రూపకల్పన చేశారు. అందుకే నాటి తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలుచేసిన విధంగానే తాను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘మనకు కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, వర్గం ఉండదు.. అర్హులైతే చాలు వారికి సంక్షేమ పథకాలు అందుతాయి’ అని వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వెళ్లారు. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజన్న స్వర్ణ యుగం వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

మరిన్ని వార్తలు