ఢిల్లీ వైరస్‌ మొండిఘటం

19 Apr, 2020 04:47 IST|Sakshi

ఢిల్లీ నుంచి వచ్చి వైరస్‌ బారిన పడిన వారు కోలుకోవడంలో తీవ్ర జాప్యం

మృతుల్లోనూ ఢిల్లీ బాధితులే ఎక్కువగా ఉన్నారు

విదేశాల నుంచి వచ్చి వైరస్‌ సోకిన వారు త్వరగా కోలుకుంటున్నారు

తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న వైద్యులు

సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారిలో రెండు రకాల బాధితులు ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వైరస్‌ బాధితులు ఒక రకంగా.. మరో ప్రాంతం నుంచి వచ్చి వైరస్‌ సోకిన వారిలో ఇంకో రకంగా ఉన్నట్టు  ప్రాథమికంగా గుర్తించారు. ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్, జర్మనీ తదితర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి వైరస్‌ సోకిన వారిలో వైరస్‌ బలం అంతగా కనిపించడం లేదని, ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు వీరు కోలుకోవడంలోనూ జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి సోకిన వైరస్‌ మ్యుటేషన్‌ (రూపాంతరం) చెంది బలహీనంగా ఉండి వుండచ్చునని వైద్యులు చెబుతున్నారు. వారు తమ పరిశీలనలో గుర్తించిన అంశాలు.. 

► పాశ్చాత్య దేశాల (అమెరికా, ఇటలీ, జర్మనీ తదితర) నుంచి వచ్చి వైరస్‌ సోకిన వారు త్వరగా కోలుకుంటున్నారు
► 60 ఏళ్లు దాటిన వారు కూడా 14 రోజుల్లోనే కోలుకున్నారు. మృతుల్లోనూ వీరి సంఖ్య తక్కువే. 
► ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లి వచ్చి వైరస్‌ బారిన పడ్డ వారు కోలుకోవడానికి బాగా సమయం పడుతోంది.
► 50 ఏళ్ల లోపు వారు కూడా త్వరగా కోలుకోలేక పోతున్నారు
► ఇండోనేషియా లేదా ఇరాన్‌ దేశస్థుల నుంచి ఈ వైరస్‌ సోకి ఉండొచ్చనే అనుమానం. 
► మృతుల్లో ఎక్కువమంది ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి నుంచి సోకిన వారే.
► 15 ఏళ్ల లోపు వారిలోనూ ఎక్కువగా ఢిల్లీ నుంచి వచ్చినవారు, వారి కాంటాక్టుల ద్వారా సోకిన వారే.

తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
విదేశాలు...ఢిల్లీ ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో వైరస్‌ తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి సోకిన వైరస్‌ చాలా బలంగా ఉన్నట్టు గుర్తించాం. దీనిపై కారణాలు కనుక్కోవాల్సి ఉంది. 
    – డా.రాంబాబు, నోడల్‌ అధికారి, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 

గడిచిన 14 రోజుల్లో ఒక్క కేసూ లేదు 
సాక్షి, విశాఖపట్నం, న్యూఢిల్లీ :  కరోనా వ్యాప్తి నిరోధానికి విశాఖ జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. గత 14 రోజుల్లో ఒక్క కేసూ నమోదవని జిల్లాగా విశాఖ నిలిచింది. ఇలా.. దేశ వ్యాప్తంగా గత 14 రోజులలో 12 రాష్ట్రాలలోని 22 కొత్త జిల్లాలలో ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదని ఒక జాబితా వెలువరించింది. ఈ జాబితాలో ఏపీ నుంచి విశాఖపట్నం కూడా ఉంది. 

కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రశంసల జల్లు.. 
విశాఖలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రశంసలు కురిపించింది. దేశ వ్యాప్తంగా 22 జిల్లాల్లో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అధికారులు తీసుకున్న చర్యల కారణంగానే జిల్లాలో రెండు వారాలుగా ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదని ప్రశంసించారు. జిల్లాలో కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడంతో కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.  మిగిలిన జిల్లాలూ ఈ తరహా చర్యలు తీసుకుంటే కరోనాని జయించవచ్చని సూచించారు. జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదుకాగా.. ఇప్పటి వరకూ 16 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. 

ఆరెంజ్‌ జోన్‌లోకి మార్చే అవకాశం  
ఏప్రిల్‌ 15న విశాఖపట్నాన్ని రెడ్‌ జోన్‌లో ఉన్నట్టు నిర్ధేశించారు. తాజాగా గడిచిన 14రోజుల్లో ఒక్క కేసు నమోదు కాకపోవడంతో విశాఖను ఆరెంజ్‌ జోన్‌లోకి మార్చే అంశాన్ని రాష్ట్ర యంత్రాంగం పరిశీలించనుంది. ఇక దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 47 జిల్లాలలో కార్యాచరణ ప్రణాళిక అమలు మంచి ఫలితాలను ఇస్తోందని, గత 28 రోజులలో  కరోనా కేసులు నమోదు కాని జిల్లాల జాబితాలో  తాజాగా కొడగు (కర్ణాటక), మహే (పుదుచ్చేరి) చేరాయని తెలిపింది. ఏప్రిల్‌ 15న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం గడిచిన 14 రోజులలో ఒక్క కేసు నమోదు కాకపోతే ఆయా జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లోకి వెళతాయని, 28 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకానిపక్షంలో గ్రీన్‌ జోన్‌లోకి వెళతాయని నిర్దేశించారు.   

మరిన్ని వార్తలు