‘నీలం’పై నీలినీడలు

24 Nov, 2013 06:43 IST|Sakshi

పర్చూరు,న్యూస్‌లైన్:  జిల్లా రైతాంగాన్ని నీలం తుపాను అతలాకుతలం చేసి రెండేళ్లయింది. నాటి విలయంలో వేలాది హెక్టార్లు నీట మునిగి రైతులు గుండెలవిసేలా రోదించారు. ఆ తర్వాత రెండు సార్లు అల్పపీడన ప్రభావంతో వరదలు.. తాజాగా పై-లీన్ కూడా బీభత్సం చేసింది. అయితే ప్రభుత్వానికి.. నీలం తుపాను నష్టపరిహారం పంపిణీ చేసేందుకు ఇప్పటికి గానీ తీరిక దొరకలేదు. పోనీ అదైనా సక్రమంగా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. కచ్చితంగా బ్యాంకు అకౌంట్లుండాలనే నిబంధనతో వందలాదిమంది రైతులు అయోమయంలో పడ్డారు. అకౌంట్ లేకుంటే పరిహారం అందదని అధికారులు తేల్చి చెప్పడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాకు *11 కోట్ల పరిహారం అందాల్సి ఉండగా కేవలం *6 కోట్లు మాత్రమే మంజూరు చేశారు.
 20 శాతం మంది ఇలా..
 జిల్లాలో మొత్తం 11456 మంది రైతులకు నీలం తుపాను నష్ట పరిహారం అందజేయాల్సి ఉంది. అయితే 20 శాతానికిపైగా రైతుల బ్యాంకు అకౌంటు ఖాతాలు.. జాబితాలోకి రాలేదు. అవగాహనలేక కొంతమంది.. ఇతర జిల్లాల అకౌంట్లు ఇచ్చినవారు మరికొంతమంది..వినియోగంలో లేని ఖాతాలు కొన్ని.. ఇలా దాదాపు 1500 మంది రైతులు పరిహారానికి అర్హత పొందలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాలు లేకపోతే చెక్కుల రూపంలోనైనా పరిహారం అందించే ఏర్పాట్లు న్నా.. సర్కారు ఈ విషయాన్ని మరచిపోయిట్లుందో.. లేక నటిస్తుందో అర్థం కావడంలేదు. గతంలో ఈ రకంగా నష్టపరిహారం అందజేసిన చరిత్ర ఉన్నా.. అధికారులు ఎందుకు ఆ దిశగా ఆలోచించడంలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నష్టపోయిన రైతాంగంలో కౌలుదారులు కూడా ఉన్నారు. వీరికి కూడా శఠగోపం పెట్టేందుకే ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
 ఇంటి పేరుతో తిప్పలు
 ఇదిలా ఉంటే కొంతమంది మహిళా రైతులు బ్యాంకు ఖాతాలు అందజేసినా పరిహారం అందించేందుకు బ్యాంకర్లు కొర్రీలు వేస్తున్నారు. దీనికి ఇంటిపేరు సాకుగా చూపిస్తున్నారు. సాధారణంగా మహిళల పెళ్లికి ముందు ఇంటి పేరు వేరుగా ఉంటుంది. పెళ్లైన తర్వాత భర్త ఇంటిపేరును తమ పేరుముందు చేర్చుతారు. అయితే ధ్రువీకరణ పత్రాలు పరిశీలించేటప్పుడు ఇంటి పేరు ఒకలా.. బ్యాంకు అకౌంటులో మరోలా ఉండడంపై బ్యాంకు అధికారులు పేచీలు పెడుతున్నారు. దీనిపై ఎలాంటి అడ్డంకులు విధించకూడదంటూ ప్రభుత్వం ఆదేశిస్తున్నా పెడచెవిన పెట్టడం సాధారణంగా మారింది.
 ఇప్పటికైనా ఖాతాలు తెరవాలి: ఎస్.దొరసాని: జిల్లా వ్యవసాయశాఖ
 సంయుక్త సంచాలకులు

 బ్యాంకు ఖాతాలు తెరవకుంటే నీలం పరిహారం అందించలేం. గతంలోనే రైతుల పాస్‌పుస్తకాల నంబర్లు సేకరించాం. ఇప్పుడు ఆ ఖాతాల్లోనే పరిహారం వేస్తాం.  డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించినా బ్యాంకు ఖాతాలు తెరవలేదు. తాజా వర్షాల వల్ల పంటనష్టపోయిన రైతులందరూ తప్పని సరిగా బ్యాంక్ పాసు పుస్తకం జెరాక్స్, ఆధార్ జెరాక్స్, పట్టాదారు పాస్‌పుస్తం జెరాక్స్ కాపీలను వీఆర్వోలకు వెంటనే అందజేయాలి. బ్యాంక్‌ఖాతా జిల్లా పరిధిలో ఉండడంతో పాటు వినియోగంలో ఉండాలి.
 

మరిన్ని వార్తలు