ఓటు రాయించుకోండి | Sakshi
Sakshi News home page

ఓటు రాయించుకోండి

Published Sun, Nov 24 2013 6:46 AM

Enter your details in voter list

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:  వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారందరికీ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అన్నిరకాల అర్హతలున్నప్పటికీ ఓటరుగా నమోదు చేసుకోలేని వారికి కూడా అవకాశం కల్పించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడు ఆదివారాలు బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండి ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈనెల 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారు. జిల్లావ్యాప్తంగా 2,751 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో 22,05,692 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత పలుమార్లు ఓటు హక్కు అవకాశం కల్పించడంతో ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇటీవల ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 23,15,407కు చేరుకుంది. వీరిలో 11,64,744 మంది పురుషులు,  11,50,574 మంది మహిళా ఓటర్లున్నారు. తాజాగా చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియతో జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలోని జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కలిగించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అంతేగాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సెల్‌ఫోన్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఓటరుగా నమోదు చేసుకోవాలంటూ ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ చైతన్యవంతులను చేస్తోంది.
 అక్కడే ఫారాలు
 ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు చెందిన బూత్‌లెవల్ ఆఫీసర్లకు అన్నిరకాల ఫారాలు జిల్లా కేంద్రం నుంచి అందాయి. కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే వారు ఫారం-6, పేర్లు తొలగింపునకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటు హక్కు బదిలీ చేసుకునేందుకు ఫారం-8ఏలను పోలింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 251 పోలింగ్ కేంద్రాలు, సంతనూతలపాడులో 228, చీరాలలో 198, పర్చూరులో 254, అద్దంకిలో 249, కొండపిలో 238, కందుకూరులో 220, దర్శిలో 240, కనిగిరిలో 257, గిద్దలూరులో 235, మార్కాపురంలో 216, యర్రగొండపాలెంలో 217 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇటీవల ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా ఇప్పటికే అందించారు. రానున్న మూడు ఆదివారాలు ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు స్పెషల్ డ్రైవ్ చేపడతారు. డిసెంబర్ 10వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే వారు అడ్రస్ ప్రూఫ్‌లతోపాటు రెండు కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటోలు బూత్ లెవల్ ఆఫీసర్లకు అందించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు అనంతరం వచ్చిన దరఖాస్తులను తీసుకొని ఇంటింటికీ తిరిగి విచారణ చేపట్టనున్నారు. అర్హులైతే వారిని ఓటర్లుగా నమోదు చేస్తారు. అనర్హులైతే పేర్లను తొలగిస్తారు. తుది జాబితాను జనవరి 16న ప్రచురించనున్నారు. ఈ జాబితా ఆధారంగా త్వరలో జరగనున్న శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తరువాత జరిగే ఇతరత్రా ఎన్నికలు ఇదే జాబితాతో జరపనున్నారు.
 అర్హులైన వారంతా ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాలి: డీఆర్‌ఓ
 వచ్చే జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్ కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌరుడికి ఓటు హక్కు ఎంతో ముఖ్యమైందన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం గురించి కాలేజీల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
 

Advertisement
Advertisement