లడ్హా ఆగయా!

12 Jan, 2019 07:35 IST|Sakshi

ఎన్‌ఐఏ రంగంలోకి దిగగానే సెలవులో వెళ్లిన పోలీస్‌ కమిషనర్‌

నాలుగురోజులే అని చెప్పి వారమైనా పత్తా లేరు

ఎన్‌ఐఏకు సహాయ నిరాకరణలో భాగంగానే అర్ధంతర సెలవన్న వాదనలు

నిందితుడు శ్రీనివాసరావును విజయవాడకు తరలించగానే నగరానికి వచ్చేసిన సీపీ

పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్హా నగరానికివచ్చేశారు.

అర్ధంతర సెలవు పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరారు.

యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. సరిగ్గా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టిన ఉత్తరక్షణమే అలా సెలవులో వెళ్లిపోయిన ఆయన.. కేసు విచారణలో భాగంగా నిందితుడు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు.. అక్కడి నుంచి జైలుకు తరలించగానే.. లడ్హా ఇలా సెలవు ముగించుకుని వచ్చేశారు.వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర కోణాన్ని దాచేసి విచారణ మొత్తం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జరిగిందన్న వాదనలకు బలం చేకూర్చేలా.. లడ్హా వ్యవహారశైలి ఉండటం వివాదాస్పదమవుతోంది.కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్లిన తర్వాత సీపీ లడ్హా ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ కేసులో శ్రీనివాసరావు తప్ప నిందితులెవ్వరూ లేరని చెప్పడం, కుట్ర కోణమే లేదని స్పష్టం చేయడం, ఆ వెంటనే సెలవులోకి వెళ్ళడం ద్వారా ఎన్నో అనుమానాలకు తావిచ్చారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో మొదటి నుంచి విశాఖ పోలీసుల వ్యవహారశైలి అనుమానాస్పదంగానే ఉంది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్‌ 25వ తేదీన దుండగుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేతపై కత్తిదూసి హత్యాయత్నం చేసిన క్షణం మొదలు.. కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు బదలీ అయిన నేపథ్యం వరకు ఏ కోణంలో చూసినా పోలీసుల తీరు ఆరోపణలకు తావిచ్చే విధంగానే ఉంది. హత్యాయత్నం ఘటన దరిమిలా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) చేపట్టిన విచారణ క్రమం పరిశీలించిన ఎవ్వరికైనా.. ఆ  కేసు నిర్వీర్యమైపోతుందని అర్ధమైపోతుంది.

సరిగ్గా అదే రీతిలో సీపీ లడ్హా.. కేసులో ఎవ్వరి పాత్ర లేదని,  శ్రీనివాసరావు ఒక్కడే ప్రచారం కోసం హత్యాయత్నానికి పాల్పడ్డాడని మొదటి నుంచి చెప్పుకొస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే హైడ్రామా సృష్టించి విచారణ తంతు సాగించారు. నెల రోజుల తర్వాత సిట్‌ ఆఫీసును కూడా క్లోజ్‌ చేసేశారు. అంతా పక్కాగా కేసును నిర్వీర్యం చేసి క్లోజ్‌ చేసేశామని పోలీసు పెద్దలు, సర్కారు పెద్దలు భావిస్తున్న తరుణంలో హైకోర్టు విచారణతో కేసు  కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్లింది. దీంతో విశాఖ పోలీసులకు, సర్కారు పెద్దలకు ఊహించని షాక్‌ తగిలింది. హైకోర్టు నిర్ణయంతో వెంటనే కేంద్ర హోంశాఖ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంతో ఆ సంస్థ జనవరి ఒకటో తేదీన కేసు నమోదు చేసింది. విషయం తెలుసుకున్న వెంటనే సీపీ లడ్హా హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టి కేసులో శ్రీనివాసరావు మినహా మరెవ్వరి పాత్ర లేదని తేల్చేశారు. మరుసటి రోజు ఎన్‌ఐఏ అధికారులు విశాఖ వచ్చి దర్యాప్తుకు రంగం సిద్ధం చేయగానే.. లడ్హా వ్యక్తిగత పనుల పేరిట సెలవుపై వెళ్ళిపోయారు.

నాలుగు రోజులని చెప్పి.. వారం రోజులు
నాలుగురోజుల పాటు వ్యక్తిగత పనులపై రాజస్థాన్‌ వెళ్ళారని పోలీసు వర్గాలు చెప్పుకొచ్చాయి. సరిగ్గా ఎన్‌ఐఏ రంగంలోకి దిగగానే ఆయన నాలుగురోజులంటూ వెళ్లి ఏకంగా వారంరోజుల పాటు.. కాదు కాదు.. కేసు విచారణ పర్వం విజయవాడకు బదిలీ అయ్యే వరకు.. శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు తరలించే వరకు.. సెలవు కొనసాగించడం చర్చనీయాంశమవుతోంది. నిజంగానే ఆయన సెలవు యాధృచ్ఛికమే అనుకున్నా...  జాతీయస్థాయిలో కలకలం రేపిన ఓ ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన సందర్భంలో లడ్హా వ్యవహారశైలి వివాదాస్పదమైంది. సరిగ్గా గురువారం అర్ధరాత్రి నిందితుడు శ్రీనివాసరావును విజయవాడకు తరలించగానే.. శుక్రవారం నుంచి లడ్హా అందుబాటులో ఉన్నారని కమిషనరేట్‌ వర్గాలు చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు