'ఆర్‌ఎస్‌ఎస్‌ ఏరోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు'

26 Dec, 2019 18:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని 42 వ డివిజన్‌లో సీపీఐ పార్టీ 95 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్‌ పార్టీ పతాకవిష్కరణ చేసి కేక్‌ కట్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకుల పక్షాన నిలిచిన పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు. బీజేపీ మాతృక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏరోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని,  బ్రిటీష్‌ వారిపై పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీయేనని వెల్లడించారు. మత విభజనలు రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని తెలిపారు.

మోడీ ఆరు నెలల పాలనలో త్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370, రామ జన్మభూమి వంటి అంశాలను తీసుకొచ్చి దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడేలా చేశారని తెలిపారు. బీజేపీ తమ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఎన్నార్సీ, క్యాబ్‌ బిలుల్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో సీపీఐ పార్టీ కార్యలయంపై చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని రామకృష్ణ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు శుక్రవారం తుమ్మళపల్లి కళాక్షేత్రం నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్స్‌ కవాతును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు