‘భూములిచ్చేయ్‌‌..లేకపోతే..’

25 May, 2017 21:18 IST|Sakshi
‘భూములిచ్చేయ్‌‌..లేకపోతే..’

► తొలకరి నాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి
► లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం
ప్రత్తిపాటిని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు


చిలకలూరిపేట: ‘దళితుల భూములు కాజేయడానికి నీకెంత ధైర్యం. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నావు. ఆక్రమించుకున్న భూములను తొలకరి సాగునాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఘాటుగా హెచ్చరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భూముల అన్యాక్రాంతానికి నిరసనగా గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూములు కాజేసేవారిని, ప్రోత్సహించేవారిని జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలవాల్సిన మంత్రి పుల్లారావు దళితులనే లక్ష్యంగా ఎంచుకుని భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.

దర్జాగా కబ్జా చేస్తున్నారు
దశాబ్దాల నుంచి సాగుచేసుకుంటున్న పచ్చని పంట పొలాలను గ్రానైట్‌ నిక్షేపాల పేరుతో దౌర్జన్యంగా, దర్జాగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తనకు సంబధం లేదని బుకాయిస్తున్న ప్రత్తిపాటి.. యడవల్లి దళతులకు చెందిన 416 ఎకరాల ఏకపట్టాను ఎందుకు రద్దు చేయించారని నిలదీశారు. వేలూరు గ్రామంలో 41.50 ఎకరాల దళితుల భూములను నీరు- చెట్టు పేరిట «ధ్వంసం చేసి రూ. 62 లక్షల మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. తూబాడులో 18 ఎకరాలు, అప్పాపురంలో 50ఎకరాలు ఇలా ఎటు చూసినా దళితుల భూములను లాక్కొని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రమేయంతోనే ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వరుస రాజకీయ హత్యలు  జరిగాయని మధు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరడం సబబేనన్నారు.

మరిన్ని వార్తలు