మార్కెట్‌కు దారేది ?

29 Sep, 2015 01:40 IST|Sakshi
మార్కెట్‌కు దారేది ?

తెనాలి టౌన్:  కోట్ల రూపాయల్లో వస్తున్న నిధులను జీతభత్యాలకు, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు అవసరమైన డొంక రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో మార్కెట్ కమిటీల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రైతు శ్రేయస్సును విస్మరించిన మార్కెట్ కమిటీలు సొంత ప్రయోజనాలను చక్కబెట్టుకోవటం గమనార్హం.గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి కమిటీల నుంచి 25శాతం నిధులు మంజూరు చేసేవారు.

ఆ నిధులతో డొంక రోడ్లు వేయడం వల్ల రైతు పండించిన ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి వీలుగా ఉండేది.  ప్రస్తుతం డొంక రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు, ముళ్ల చెట్లతో నిండిపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి దుగ్గిరాలకు వెళ్లే రోడ్డు పిచ్చిచెట్లతో మూసుకు పోయింది. గుం టూరు, పల్నాడు ప్రాంతాల రైతులు పండించిన పసుపును దుగ్గిరాల మార్కెట్ యార్డుకు గతంలో ఈ రోడ్డు ద్వారా తీసుకు వెళ్లేవారు.  ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
 
కమిటీలపై తెలుగు తమ్ముళ్ల కన్ను..
జిల్లాలో 20వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో గుంటూరు, తెనాలి, దుగ్గిరాల యార్డులు పూర్తి గా రెగ్యులేటేడ్ యార్డులుగా కొనసాగుతున్నాయి. ఈ కమిటీల ఆదాయం కోట్ల రూపాయల్లోనే ఉంది. ఏడాదికి గుంటూరు యార్డుకు రూ.30 కోట్లు, తెనాలి యా ర్డుకు రూ.5కోట్లు, దుగ్గిరాల యార్డుకు రూ.3నుంచి 4 కోట్లు ఆదాయం ఉంటుంది. తెనాలి, దుగ్గిరాల, పొ న్నూరు, బాపట్ల, ఈపూరు, పిడుగురాళ్ళ, నరసరావుపేట, చిలకలూరిపేట, రాజుపాలెం, వినుకొండ, రొంపిచర్ల మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు.

గుంటూరు, మంగళగిరి, కూచినపూడి, రేపల్లె, క్రోసూరు, సత్తెనపల్లి, తాడికొండ, ఫిరంగిపు రం, మాచర్ల వ్యవసాయ కమిటీలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. ఈ కమిటీలలో పదవులను ఆశించే తెలుగు తమ్ముళ్లు ఎక్కువ  కావడంతో కమిటీ పాలకవర్గ నియామకం ఆలస్యం అవుతుంది. తెనాలి కమిటీ నుంచి వేరుగా వేమూరు కమిటీ ఏర్పాటుకు కొత్తగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించిన దస్త్రం సీఎం కార్యాలయంలో ఉందని అధికారులు తెలిపారు.
 
జీవో జారీ చేయాలి..
ఇంతకు ముందు  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మార్కె ట్ కమిటీల నిధుల నుంచి  లింకురోడ్డుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో వాటిని రద్దు చేశారు. తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రోడ్ల నిర్మాణానికి నిధులు వాడవచ్చని జీవో జారీ చేసినప్పటికి అమలు కాలేదు. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున దెబ్బతిన్న లింక్ రోడ్డులకు మార్కెట్ కమిటీల నుంచి నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు