రైల్వేలో సీటీఐల హవా!

21 Oct, 2017 08:12 IST|Sakshi

నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు

దీర్ఘకాలంగా తిష్ట

రైల్వే ఆదాయానికి గండి

సాక్షి, విజయవాడ: విజయవాడ స్టేషన్‌ పరిధిలో చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్ల(సీటీఐ)హవా సాగుతోంది. ఉన్నతాధికారుల్ని ప్రసన్నం చేసుకుని ఇక్కడ నుంచి బదిలీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రయాణికుల నుంచి జరిమానాలు వసూలు చేయకుండా తమ జేబులు నింపుకుంటున్నారు. రైల్వే ఆదాయానికి గండికొడుతున్నారు.

ఆయన రూటే సేప‘రేటు’
విజయవాడ స్టేషన్‌లో పనిచేసే ఒక కీలక సీటీఐ రూటే సెప‘రేటు’. ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌(టీæటీఈ)ల నుంచి ముడుపులు వసూలు చేస్తుండడంతో ఆయన్ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు రైల్వేస్టేషన్‌లో ప్రచారం జరుగుతోంది. ఓ టీటీఈ నెలరోజులు సెలవు అడిగితే రూ.30వేలు డిమాండ్‌ చేయడంతో ఆయన భార్య ఏకంగా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసింది. డ్యూటీలు వేసే విషయంలోనూ, పదోన్నతుల ఇప్పిస్తానంటూ డబ్బులు గుంజుతారనే ఆరోపణలు ఉన్నాయి. టీటీఐలపై ఏదైనా ఫిర్యాదు వస్తే వారికి పండగే. తన చేతికి మట్టి అంటకుండా  ఉండేందుకు తనకు ఇవ్వాల్సిన మామూళ్లను నగరంలోని ఒక మద్యం దుకాణంలో ఇచ్చే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.  

నకిలీ సర్టిఫికెట్లతో చలామణి
కొంతమంది సీటీఐలు చూపిస్తున్న కుల సర్టిఫికెట్లపైన వివాదాలు ఉన్నాయి. విజయవాడ స్టేషన్‌ పరిధిలో చేసే కొందరు సీటీఐల కుల సర్టిఫికెట్లపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేసి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వమని కోరినా ఇవ్వలేదని తెలిసింది. ఒక సీటీఐ కుల సర్టిఫికెట్‌ను ఉన్నతాధికారులు నిలుపుదల చేయగా, ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సీటీఐలపై ఫిర్యాదులు వస్తే చార్జిషీట్‌ ఇస్తారు. దీన్ని ఆరునెలల్లోపు విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకోవాలి. విచారణాధికారి, ఉన్నతాధికారుల్ని ప్రలోభ పెట్టి తమపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా జాగ్రత్త సీటీఐలు జాగ్రత్త పడుతున్నారు.

ఆయనకు ఎప్పుడూ ప్రొటోకాల్‌ డ్యూటీయే
ఓ సీటీఐ ఎప్పుడూ ప్రొటోకాల్‌ డ్యూటీయే చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా ఉన్నతాధికారులు వస్తే ప్రొటోకాల్‌ ఆఫీసర్లుగా ఎస్‌ఎస్, ఎస్‌ఆర్‌ఎం, డీప్యూటీ ఎస్‌ఎస్, ఏఎస్‌ఎంలు వ్యవహరించాలి. లేకుంటే ఆయా విభాగాల నుంచే ప్రొటోకల్‌ అధికారిని నియమించుకోవాలని రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిబంధనలను తుంగలోతొక్కి ఏ ఉన్నతాధికారి వచ్చినా ఆయనే ప్రొటోకాల్‌ అధికారిగా వెళతారు. ఈయన డ్యూటీ కంటే ప్రొటోకాల్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఆహార పదార్థాలు అమ్ముకునే వారినీ వదలడం లేదు..
ఒక్కొక్క సీటీఐ ఐదేళ్లు మాత్రమే చేయాలి. ఉన్నతాధికారుల అనుమతితో మరొక ఏడాది చేయవచ్చు. ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకు మార్చాలంటే ఆ సీటీఐ కనీసం రెండేళ్లు రైల్వేస్టేషన్, ఎమినిటీస్‌ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇటువంటి నిబంధనలు విజయవాడ డివిజన్‌లో పాటించడం లేదని తెలిసింది. కొంతమంది సీటీఐలు దీర్ఘకాలంగా తిష్ట వేసుకుంటున్నారు. వీరికి ఇచ్చే టార్గెట్లను పూర్తిచేసే విషయంలోనూ సులభమైన మార్గాలు అన్వేషిస్తున్నారు. బీహార్, బడిశా, పశ్చిమ బెంగాల్‌ తదితర దూర ప్రాంతాలకు రిజర్వేషన్‌ దొరకనప్పుడు ప్రయాణికులు సాధారణ టికెట్‌ కొనుగోలు చేసి రిజర్వేషన్‌ బోగీలో ఎక్కేస్తారు. ఇటువంటి వారికి జరిమానాలు వేసి టార్గెట్లు పూర్తిచేసుకుంటున్నారు.

అదే సమయంలో వారి జేబులు నింపుకుంటున్నారు. టార్గెట్లు పూర్తయ్యేందుకు చెన్నై తదితర నగరాలకు కూడా వెళ్లి తనిఖీలు చేసుకుని గూడూరులో కేసులు నమోదు చేసినట్లు చూపిస్తున్నారంటూ రైల్వే ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రూట్‌లో రైలు వద్ద ఆహార పదార్థాలు అమ్ముకునే కాంట్రాక్టును ఒక కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే కాంట్రాక్టు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. ఈ రూట్‌లో ప్లాట్‌ఫారంపై అనధికారికంగా ఆహారపదార్థాలు అమ్మే వారి నుంచి సీటీఐలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం
ఓ సీటీఐపై ఆరోపణలు రావడంతో నా కార్యాలయం నుంచి పంపేశాను. టీటీఈలు లేదా సిబ్బంది డబ్బు కోసం వేధిస్తే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాను. ఫోన్‌ నంబర్లు అందరికీ అందుబాటులో ఉంచాం. ఎస్‌ఎంఎస్‌ చేస్తేచాలు విచారించి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసే వారి సమాచారం రహస్యంగా ఉంచుతాం. తరచూ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేసి సిబ్బంది సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. –షిపాలీ కుమారి, సీనియర్‌ డీసీఎం

మరిన్ని వార్తలు