కువైట్‌లో కడప వాసి అనుమానాస్పద మృతి

29 Jan, 2015 22:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కువైట్‌లో పనిచేస్తూ  మరణించిన పాతకడప వాసి సూరే వెంకటరవి (28) మృతిపై అతని తమ్ముడు ఎస్.వి.సుధాకర్ అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేశారని వైఎస్సార్‌సీపీ కువైట్ కోఆర్డినేటర్ ఇలియాస్ బీహెచ్ తెలిపారు. ఈ మేరకు ఆయన అక్కడి నుంచి ఒక ఈమెయిల్ పంపారు.

ఈ నెల 22వ తేదీన తన అన్న పనిచేసే ఇంటి యజమాని (కువైటీ) ఫోన్ చేసి రవి ఉరి వేసుకుని మరణించారని తెలిపారని, ఇది నమ్మశక్యంగా లేదని రవి తమ్ముడు తమకు తెలపడంతో తాను, పార్టీ సంయుక్త కోఆర్డినేటర్ ఎం.బాలిరెడ్డి, అభయ ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ప్రతినిధి దుగ్గి గంగాధర్ రంగంలోకి దిగి రాయబారకార్యాలయం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఈ విషయంలో న్యాయం చేస్తామని రాయబార కార్యాలయం అధికారులు తమకు హామీ ఇచ్చారన్నారు.

కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఈ విషయమై తమకు ఫోన్ చేసి మృతి చెందిన రవి సోదరునికి అన్ని రకాల సహాయ సహాయసహకారాలు అంద జేయాలని సూచించారన్నారు. రవి మృత దేహాన్ని మరో నాలుగు రోజుల్లో భారత్‌కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇలియాస్ వివరించారు. ప్రవాసులు షేక్ అన్వర్, షేక్ ఇనాయత్, పి.రెహ్మాన్‌ఖాన్ కూడా తమకు ఈ విషయంలో సహకరించారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు