తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్

8 Nov, 2014 03:54 IST|Sakshi
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్

వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాదిపాటు మారటోరియం
జనవరి 12 నాటికల్లా కొత్త రుణాలు మంజూరు
రుణాల చెల్లింపు 5-7ఏళ్ల ల్లోపు చెల్లించేందుకు అంగీకారం
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక కమిటీ సమావేశంలో నిర్ణయాలు

 
హైదరాబాద్: హుద్ హుద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రలోని కోస్తా జిల్లాల్లో పంట, పరిశ్రమలకోసం తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయడంతోపాటు కొత్త రుణాలను మంజూరు చేసేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయిం చింది. తుపాను వల్ల నాలుగు జిల్లాల్లో, మొత్తం 120 మండలాలు నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళంలో 38, విశాఖపట్టణంలో 43, విజయనగరంలో 34, తూర్పు గోదావరిలో ఐదు మండలాల్లో జనవరి 12 నాటికల్లా రుణాలను రీ షెడ్యూల్, కొత్త రుణాలను ఇచ్చేం దుకు బ్యాంకర్లు తమ అంగీ కారం తెలిపారు. మూడు నెల ల్లోగా బాధితులకు అందాల్సిన సహాయ, తోడ్పాటు కార్యక్రమాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రత్యేక సమావేశం తీర్మానించింది. వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాది పాటు మారిటోరియం విధిస్తూ ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం తీసుకుంది.

రుణాలను రైతులు 5-7 ఏళ్లలో తిరిగి చెల్లించవచ్చని పేర్కొంది.  హుద్‌హుద్ తుపాను కారణంగా నష్టపోయిన జిల్లాల్లో సహాయక చర్యలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సమావేశానికి ఎస్‌ఎల్‌బీసీ కన్వీనరు సి.దొరస్వామి అధ్యక్షత వహించారు. ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంకు సీఎండీ సివిఆర్ రాజేంద్రన్ ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్ల ధ్రువీ కరించిన అన్నవారీ సర్టిఫికెట్లు పొందాలని, బ్యాంకర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. తుఫాను బాధితుల సహాయార్థం బ్యాంకర్ల కమిటీ తరఫున రూ.2.50 కోట్లను శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుకు కలిసి అందించామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి బ్యాంకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీం చేసిన సూచనకు తాము  సుముఖత వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం మాట్లాడుతూ తుఫాను నష్టంపై గ్రామాలవారీగా నివేదికలు రూపొందించి కేంద్రానికి  పంపామని, ఈ నెల 12 తర్వాత కేంద్ర బృందం పర్యటన ఉండొచ్చని తెలిపారు.  తుపాను కారణంగా 3 వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని ఆ సమాఖ్య అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఎస్‌ఎల్‌బీసీకి విన్నవించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఖరీఫ్ రుణాలు45 శాతం వరకు మంజూరు చేయగా, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రుణాల శాతం కేవలం 25గానే ఉందని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు