డీఎడ్ సీటుకు లక్షన్నర!

18 Nov, 2013 02:22 IST|Sakshi
డీఎడ్ సీటుకు లక్షన్నర!
యాజమాన్య కోటాలో ప్రైవేటు కాలేజీల వసూళ్లు
  ‘మెరిట్’కు పాతర.. ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ
  నియంత్రించలేకపోతున్న అధికారులు
  మేనేజ్‌మెంట్ కోటా ఫీజునే నిర్ధారించని విద్యాశాఖ
 
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ప్రైవేటు డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు వసూళ్ల దందాకు దిగాయి. ఒక్కో సీటుకు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాయి. ఇందుకోసం మెరిట్ ప్రకారమే సీట్ల భర్తీ చేపట్టాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా.. ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. అసలు డీఎడ్ కోర్సు యాజమాన్య కోటా సీట్లకు ప్రభుత్వం కచ్చితంగా ఫీజును నిర్ధారించకపోవడం ప్రైవేటు డీఎడ్ కాలేజీ నిర్వాకానికి మరింత ఊతం ఇస్తోంది. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం రీయింబర్స్ చేస్తున్న ఫీజునే యాజమాన్య కోటా కింద వసూలు చేయాలని అధికారులు చెబుతున్నా.. కాలేజీలు మాత్రం విద్యార్థుల నుంచి అందినకాడికి దోచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే సీటుకు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాయి కూడా. డీఎడ్ కోర్సు చదివేందుకు మొగ్గు చూపుతున్న వారిలో 90 శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే. రూ. లక్షల్లో ఫీజు చెల్లించలేక వారు లబోదిబోమంటున్నారు.
 
 ఎస్జీటీ పోస్టులకు అర్హతే ఆకర్షణ..
 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. రాష్ట్రంలో ఇంతకుముందు డీఎడ్ కోర్సుకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు.. కాలేజీల సంఖ్య కూడా తక్కువే. దాంతో అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండిపోయింది. ప్రస్తుతం విద్యాహక్కు చట్టం నేపథ్యంలో.. డీఎడ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది డీఎడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల ఆసక్తిని ప్రైవేటు డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. రూ. 12,500 ఉన్న కన్వీనర్ కోటా ఫీజుకంటే పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 642 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉండగా వాటిలో 80 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 20 శాతాన్ని యాజమాన్య కోటాలో భర్తీచేస్తారు. డీఎడ్ కాలేజీలన్నింటిలో కలిపి దాదాపుగా 36 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి 3 లక్షల మంది వరకూ డైట్‌సెట్ రాయగా.. అందులో 2.72 లక్షల మంది అర్హత సాధించారు. దాంతో యాజమాన్య కోటాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
 
 రూ. లక్షన్నరదాకా: ప్రధాన పట్టణాల్లో ఉన్న, పేరున్న డీఎడ్ కాలేజీలు ఒక్కో సీటుకు రూ. 1.3 లక్షల వరకు వసూలు చేస్తుండగా.. ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ. 70 వేల నుంచి రూ. లక్ష దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. దాంతో యాజమాన్య కోటా భ ర్తీకి కాలేజీలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మెరిట్‌ను పక్కనబెట్టి ఎక్కువ డబ్బు చెల్లించినవారికే సీట్లను కేటాయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 యాజమాన్య కోటాకు ఫీజు విధానమేదీ?
 రాష్ట్రంలోని 25 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సీటు పొం దేందుకు.. రూ. లక్ష లోపు ఆదాయం ఉండి, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు రూ. 150 అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. రీయింబర్స్‌మెంట్ వర్తించని విద్యార్థులు రూ. 2,325 చెల్లించాలి. ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు పొందే, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులు రూ. 1,500 అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. రీయింబర్స్ పరిధిలోకి రాని విద్యార్థులు రూ. 12,500 అడ్మిషన్, ట్యూషన్ ఫీజుల కింద చెల్లించాలి. అయితే, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో యాజ మాన్య కోటాకు ఫీజు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం లేదు. అటు ప్రవేశ ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోనూ డీఎడ్ కోర్సుల ఫీజులు లేవు. దాంతో ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదనే ధైర్యంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అసలు డీఎడ్ యాజమాన్యకోటా సీటుకు కూడా రూ. 12,500 మాత్రమే ఫీజుగా వసూలు చేయాలని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా అమలుకావడం లేదు.
>
మరిన్ని వార్తలు