నేటి నుంచి డిగ్రీ పరీక్షలు..

7 Mar, 2015 02:05 IST|Sakshi

నెల్లూరు(విద్య) : విక్రమసింహపురి విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ డిగ్రీ పరీక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 వరకు సెకండియర్, ఫైనలియర్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 77 కళాశాలల విద్యార్థుల కోసం 44 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 13,893, రెండవ సంవత్సరం 11,592, మూడవ సంవత్సరం 8,794 మంది  విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
 పకడ్బందీ ఏర్పాట్లు
 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రశ్నాపత్రాల భద్రత, పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది నియామకంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సెల్ఫ్‌సెంటర్లపై వస్తున్న ఆరోపణలను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన  8 సెల్ఫ్‌సెంటర్లలో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఈ సెంటర్లలో ఇద్దరు అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మొదటిసారిగా డివిజన్‌ల వారీగా కేంద్రాల తనిఖీలకు మూడు టీంలను ఏర్పాటు చేశారు. నెల్లూరు, కావలి, గూడూరు డివిజన్‌ల పరిధిలో ఒక్కొక్క టీంకు ఒక కోఆర్డినేటర్, ఇద్దరు సభ్యులను నియమించారు. హైపవర్ కమిటీలకు ప్రత్యేక అధికారాలిచ్చారు. పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన అంశాలపై ప్రత్యేకదృష్టి సారించారు.
 
 గత విధానంలో కాకుండా పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి అడ్వాన్స్‌లు ఇవ్వనున్నారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.8.50 పైసలు చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. ప్రభు త్వ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల వివరాలను సేకరించి సీనియార్టీ జాబితాను రూపొం దించనున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన వివిధస్థాయిల్లో అధికారులను నియమించే అవకాశం ఉంది. గతంలో ప్రశ్నాపత్రాలు లీకైనా సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నుంచి ప్రశ్నాపత్రాలను పోలీసు స్టేషన్‌లో, నోడల్ కేంద్రాల్లో భద్రపరచే చర్యలు చేపట్టారు.
 
 పకడ్బందీగా జరిగేనా..?
 ఈ ఏడాది నుంచి నూతన పద్ధతులను ప్రవేశపెట్టి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు హడావుడి చేస్తున్నారు. అయితే అధికారులు చేసిన మార్పులు కేవలం పరిపాలన పరంగానే ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పరీక్షా విధానంలో మార్పులు జరగలేదనేది కొంతమంది వాదన. ముఖ్యంగా కేవలం కళాశాలలను మాత్రమే జంబ్లింగ్ చేయడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది.
 
  కార్పొరేట్ కళాశాలతో కుమ్మకై మొత్తం కళాశాలను మాత్రమే జంబ్లింగ్ విధానంలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులను జంబ్లింగ్ చేస్తామని మూడేళ్లుగా చెబుతున్నా ఈ ఏడాది కూడా విద్యార్థుల జంబ్లింగ్ చేయకపోవడం వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే అవకాశాలు, మౌలిక వసతులు ఉన్నప్పటికీ ఇంకా ఎనిమిది సెల్ఫ్‌సెంటర్లను ఏర్పాటు చేయడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు.
 

మరిన్ని వార్తలు