ప్రజాభాగస్వామ్యంతోనే ఉత్సవాలు: డిప్యూటీ సీఎం

30 Sep, 2019 08:23 IST|Sakshi
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు బొత్ససత్యనారాయణ, పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లానచంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, జేసీ, ఎస్పీ, తదితరులు

సాక్షి, విజయనగరం : ప్రజలందరి భాగస్వామ్యంతో విజయనగరం ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా అధికారులు, వివిధ కమిటీల సభ్యులకు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం సిరిమానోత్సవం, విజయనగర ఉత్సవాలపై ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ నిర్వహణలో సంప్రదాయాలకు భంగం కలిగించకుండా  వ్యవహరించాలని స్పష్టం చేశారు. సిరిమానోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తూనే అధికంగా భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా భక్తుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.  

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఏ చిన్న సంఘటనకు తావులేకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.  ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారు. అక్టోబర్‌ 12 నుంచి 14 వరకూ మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు, విజయనగరం సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని తెలిపా రు. ఐదు వేదికల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, జిల్లాకు చెందిన విశిష్ట వ్యక్తులకు సత్కరించనున్నామని వెల్లడించారు. 

జిల్లా ప్రతిష్ట పెంపొందించాలి
ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జిల్లా ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లాకు సాంస్కృతికంగా ఎంతో విశిష్టత ఉందని, దాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గతం కంటే మిన్నగా ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అత్యధికంగా భక్తులు సిరిమానోత్సవం తిలకించేలా అవకాశం కల్పించాలన్నారు.  సిరిమానోత్సవం రోజున నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ప్రముఖుల దర్శనానికి నిర్దిష్ట సమయాలు కేటాయించాలని చెప్పారు. సామాన్య భక్తుల దర్శనానికే అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు.

జేసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఒక్కో వేదిక వద్ద కార్యక్రమాల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  గతంలో నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది పుష్ప ప్రదర్శనను సంగీత కళాశాలలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆనందగజపతి ఆడిటోరియంలోనూ, 13, 14 తేదీల్లో సాయంత్రం వేళల్లో అయోధ్యా మైదానంలో కార్యక్రమాలను ఏర్పాటుచేశామన్నారు. 15న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత బాణాసంచా కాల్చే ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఇందుకు అనువైన ప్రదేశాన్ని పోలీసు అధికారులే గుర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో పలు స్వచ్చందసంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు, తమ అభిప్రాయాలను, సూచనలను వ్యక్తపరిచారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్పీ రాజకుమారి, జేసీ–2 ఆర్‌.కూర్మనాథ్, డీఆర్‌ఓ వెంకటరావు, ఓఎస్‌డీ జె.రామ్మోహనరావు, ఏఎస్‌పీ ఎన్‌.శ్రీదేవీరావు తదితరులు పాల్గొన్నారు. 

ఫ్లెక్సీలు, బ్యానర్లకు అనుమతులివ్వద్దు
విజయనగర ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుకు  ఎటువంటి అనుమతులివ్వవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ పురపాలక అధికారులను ఆదేశించారు. ఏ పార్టీ తరఫునైనగానీ, వ్యక్తుల తరఫునగానీ బ్యానర్లు, ప్లెక్సీలు  ఏర్పాటు చేయకుండా నియంత్రించాలన్నారు.  మున్సిపాలిటి అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలకు అనుమతించిన హోర్డింగులు మినహా ఏ ఒక్కటీ అదనంగా కనిపించడానికి వీల్లేదన్నారు.  

మరిన్ని వార్తలు