ఉద్యోగుల విభజనపై కసరత్తు

7 Mar, 2014 02:16 IST|Sakshi
సీఎస్ మహంతితో భేటీ తర్వాత బయటికి వస్తున్న కమలనాథన్, కమిటీలోని ఇతర సభ్యులు

సీఎస్‌తో కమల్‌నాథన్ కమిటీ భేటీ
మార్గదర్శకాల రూపకల్పనకు తొలి సమావేశం
2 వారాల్లోనే పూర్తి చేసే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాధికారులు అర్చనావర్మ, కె.కిప్‌జెన్, ఎస్.నాయక్, ప్రతాప్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం మీదే చర్చ సాగింది. భేటీ అనంతరం సమావేశం వివరాలను అధికారులు వెల్లడించారు.

వాటిలో ముఖ్యాంశాలు ఇవీ..
* మార్గదర్శకాలు ఖరారు, అన్ని శాఖల స్టాఫ్ పాట్రన్ నిర్ధారణ తర్వాతే ఉద్యోగుల విభజన మొదలవుతుంది. పోస్టులను జనా భా నిష్పత్తిలో విభజించిన తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రారంభమవుతుంది.

* కమిటీ సూచనలకు అనుగుణంగా పోస్టుల గణాంకాలపై రెండు మూడు రోజుల్లో అధికారులు నివేదిక రూపొందించనున్నారు.
* రాష్ట్రంలో 76 వేల రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయని అధికారుల అంచనా. ప్రస్తుతం ఈ పోస్టుల్లో పనిచేస్తున్న 52 వేల మంది ఉద్యోగుల వివరాలు ప్రభుత్వానికి అందాయి. మరో 4 వేల మంది వివరాలు త్వరలో అందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

* ఉద్యోగుల విభజనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఖరారు చేయడానికి కమిటీకి నెల రోజుల గడువు ఉంది. అయితే రెండు వారాల్లోనే పని పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం రాష్ట్ర స్థాయి పోస్టులు, సింగిల్ యూనిట్ (సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ) ఉద్యోగుల విభజన కమిటీ పరిధిలో ఉంటుంది. అఖిల భారత అధికారుల విభజనతో సంబంధం లేదు.
* కమిటీ తదుపరి సమావేశం వచ్చే వారం నిర్వహించవచ్చు. ఉద్యోగ సంఘాలతోనూ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది.    
 
సొంత జిల్లాలకు వెళ్లడానికి అనుమతించాలి
ఓపెన్ కోటా టీచర్లపై పీఆర్‌టీయూ

సాక్షి, హైదరాబాద్: ఓపెన్ కేటగిరీలో ఎంపికైన నాన్ లోకల్ టీచర్లు సొంత జిల్లాలకు వెళ్లడానికి వీలుగా వారికి ఆప్షన్ సౌకర్యం కల్పించాలని పీఆర్‌టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమల్‌నాథన్ కమిటీకి సిఫార్సు చేయాలని కోరుతూ పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, కె.జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. ప్రతినిధి బృందం సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ...

ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను ఒకే యాజమాన్యం కిందకు తీసుకురావాలి. టీచర్లకు పదోన్నతులు కల్పించి.. విద్యాశాఖలోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి.

రాష్ట్రంలో 3.50 లక్షల మంది ఉపాధ్యాయుల వివరాలను కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.
* గతేడాది బదిలీ చేసి, ఇంకా రిలీవ్ చేయని ఉపాధ్యాయులను ఈ విద్యాసంవత్సరం ఆఖరు రోజు (లాస్ట్ వర్కింగ్ డే) రిలీవ్ చేయాలి.

మరిన్ని వార్తలు