నేరగాళ్లపై బైండోవర్ అస్త్రం | Sakshi
Sakshi News home page

నేరగాళ్లపై బైండోవర్ అస్త్రం

Published Fri, Mar 7 2014 2:29 AM

నేరగాళ్లపై బైండోవర్ అస్త్రం - Sakshi

  • తొలివిడతలో 180 మందిపై అమలు
  •   స్థానిక ఆర్డీఓల వద్ద పక్కా పూచీకత్తులు
  •   మరోసారి నేరం చేస్తే ఆ మొత్తం స్వాధీనం
  •   ఆదేశాలు జారీ చేసిన సీసీఎస్ అధికారులు
  •  సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా గణేష్ ఉత్సవాలు, బోనాలతో పాటు ఎన్నికలు సమయాల్లో రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల్ని పోలీసులు బైండోవర్ చేస్తుంటారు. తద్వారా సదరు వ్యక్తి ఆ సందర్భంలో నేరం చేయడానికి, అలజడి సృష్టించడానికి వెనకడుగు వేస్తాడు. ఇది అనేక సందర్భాల్లో మంచి ఫలితాలే ఇచ్చింది. ఇదే అస్త్రాన్ని పదే పదే ప్రాపర్టీ అఫెన్సులు చేసే వారిపై ప్రయోగిస్తే... ఇదే ఆలోచన వచ్చింది సీసీఎస్ అధికారులకు. స్నాచింగ్స్, చోరీలు, దొంగతనాలు వంటి నేరాలను పదే పదే చేస్తున్న వారిపై బైండోవర్ అమలు చేయాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు.. అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించారు. గురువారం నగర వ్యాప్తంగా అన్ని ఠాణాలతో పాటు ప్రత్యేక విభాగాల్లో పనిచేసే డిటెక్టివ్, క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నేరగాళ్ల బైండోవర్‌కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నేర నివారణ, పాత నేరస్తుల కట్టడి చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు ‘సాక్షి’కి తెలిపారు.
     
    అప్‌డేట్ అయిన ఎంఓ క్రిమినల్స్ డేటా
     
    నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన కొన్నేళ్ల గణాంకాలు, నేరాలను విశ్లేషిస్తే 80 శాతం పాతవారే పదే పదే నేరాలు చేస్తున్నట్లు తేలింది. వీరిపై కన్నేసి ఉంచితే కొంతవరకైనా నేర నివారణ సాధ్యమన్న కోణంలో సీసీఎస్ అధికారులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఎంఓ క్రిమినల్స్ డేటాను అప్‌డేట్ చేశారు. కమిషనరేట్ పరిధిలో గత దశాబ్ద కాలంలో 50 వేలకు పైగా నేరగాళ్లు అరెస్టు అయ్యారు. వీరిలో దాదాపు 30 వేల మంది ఒకసారి కంటే ఎక్కువసార్లే పోలీసులకు చిక్కారు.

    పోలీసు పరిభాషలో వీరినే ఎంఓ క్రిమినల్స్‌గా పరిగణిస్తారు. వీరికి సంబంధించి సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్‌బీ)లో డేటా బేస్ ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో సమీక్షించిన సీసీఎస్ అధికారులు.. ఎంఓ క్రిమినల్స్ చిరునామాలను వెతికి పట్టుకుని వారి ఫొటోలు, తాజా వివరాలతో పాటు వారి సంబంధీకులవీ నమోదు చేశారు. ఈ ఎంఓ నేరగాళ్లపై సస్పెక్ట్ షీట్స్ సాధారణంగా వారు నివసిస్తున్న ప్రాంతం పరిధిలోని ఠాణాలో ఉంటాయి. అయితే కొందరు తాము నివసిస్తున్న ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేయట్లేదు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఇతడి విషయం తెలియట్లేదు.
     
    ప్రాథమికంగా 180 మందితో జాబితా

     
    ఎంఓ క్రిమినల్స్ డేటా అప్‌డేట్ చేసిన సీసీఎస్ పోలీసులు ఆయా షీట్లను పాత నేరగాళ్లు పంజా విసురుతున్న ప్రాంతాల్లోని ఠాణాలకూ పంపారు. ఎంఓ క్రిమినల్స్ డేటా అప్‌డేట్ చేయడంతో ఒకటి కంటే ఎక్కువసార్లు నేరాలు చేస్తున్న వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనే విషయం స్పష్టంగా తెలిసింది. ఈ లిస్టును మరింత మధించిన ప్రత్యేక బృందాలు పదే పదే నేరాలు చేస్తూ అరెస్టు అవుతూ, బెయిల్ పొంది బయటకు వచ్చి మళ్లీ పంజా విసురుతున్న వారి వివరాలతో మరో డేటా రూపొందించింది. వీరిలోంచి అత్యంత సమస్యాత్మకంగా మారిన 180 మందిని గుర్తించారు. తొలివిడతలో వీరిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉండే ఆర్డీఓల వద్ద బైండోవర్ చేయాలని నిర్ణయించారు. సదరు నేరగాడు ఏ ప్రాంతానికి చెందిన వాడో ఆ స్థానిక ఆర్డీఓ వద్దే హాజరుపరుస్తారు.
     
    బైండోవర్ అంటే ఇదీ...

    దీన్నే సాంకేతిక పరిభాషలో ‘బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్’గా పరిగణిస్తారు. ఓ వ్యక్తి వల్ల నేరం జరుగుతుందని కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కానీ స్పష్టమైన సమాచారం ఉన్నప్పుడు విషయాన్ని పోలీసు అధికారి సెకండ్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా పిలిచే తహశీల్దార్/ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్తారు. ముందుజాగ్రత్త చర్యగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లోని 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్ చేస్తారు. ఈ ప్రక్రియలో అనుమానిత వ్యక్తి నుంచి అధికారులు బాండ్ తీసుకుంటారు. తాను ఎలాంటి సంఘ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనంటూ ఆ వ్యక్తి అందులో స్పష్టం చేస్తారు. దీనికి కొంత మొత్తాన్ని ష్యూరిటీగా బాండ్‌లో నమోదు చేస్తాడు. దీన్ని ఉల్లంఘిస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. అనుమానిత వ్యక్తి వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే... 24 గంటల వరకు అదుపులో ఉంచుకునే అవకాశమూ పోలీసులకు ఉంటుంది.
     
    సీఆర్‌పీసీ 108 ప్రయోగం
     
    నగర పోలీసులు బైండోవర్ చేయాల్సిన ప్రాపర్టీ అఫెండర్స్‌పై సీఆర్పీసీలోని 108 సెక్షన్ ప్రయోగించనున్నారు. వీరిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడంతో పాటు అతడి పూర్తి నేరచరిత్రను ఆయనకు నివేదిస్తారు. పూచీకత్తు మొత్తాన్ని నేరగాడి వ్యవహారశైలిని బట్టి రూ.2 లక్షల వరకు ఉండేలా చూడాలని భావిస్తున్నారు. గరిష్టంగా ఏడాది కాలంలో ఆ వ్యక్తి మరోసారి నేరం చేసినట్లు తేలితే అరెస్టు చేయడంతో పాటు పూచీకత్తుగా ఉంచిన మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఎవరైనా పూచీకత్తు కట్టనంటే నేరుగా జైలుకు పంపించే అవకాశమూ ఉంటుంది. కట్టలేని పక్షంలో మరో వ్యక్తి ష్యూరిటీగా ఉండి పూచీకత్తుకు సమాన విలువ కలిగిన స్థిరాస్తి పత్రాలను అందించాలి. నేరగాడు బైండోవర్‌ను ఉల్లంఘిస్తే ఆ సొత్తు ప్రభుత్వ పరమౌతుంది. గురువారం నాటి సమావేశంలో ఈ వివరాలను సిబ్బందికి తెలిపిన అధికారులు... వచ్చే వారం నుంచి బైండోవర్ల ప్రక్రియ ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

Advertisement
Advertisement