దేవాదాయ శాఖలో అధర్మం

26 Sep, 2014 23:43 IST|Sakshi

నగరానికి దూరప్రాంతాల నుంచి వచ్చే వారి ఆకలి తీర్చాలన్న ఓ మహానుభావుడి ఆశయాన్ని అటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఇటు కొందరు స్వార్థపరులు పక్కదారి పట్టించి, వారి ధనదాహం తీర్చుకుంటున్నారు. కాకినాడ నడిబొడ్డున సినిమారోడ్లో ఉన్న శ్రీ మంత్రిప్రగడ వారి సత్రం చుట్టూ అల్లుకున్న ఈ అక్రమ వ్యవహారం ఎప్పుడో వెలుగు చూసినా.. అడ్డుకట్ట మాత్రం పడలేదు.

సాక్షి, కాకినాడ : మంత్రిప్రగడ నరసింహారావు అనే దాత స్వాతంత్య్రానికి పూర్వం కాకినాడకు వైద్యం నిమిత్తం వచ్చే రోగులు, ఇతరులకు భోజన సదుపాయం కల్పించే లక్ష్యంతో మూడువేల చదరపు గజాల్లో సత్రాన్ని నిర్మించి, నిర్వహణ నిమిత్తం అమలాపురం,  కడియంలలో వ్యవసాయ భూముల్ని సమకూర్చారు.
 
సత్రం భూమిలో సుమారు 1500 గజాలను 60 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్న ఓ సంస్థ   సినిమా థియేటర్‌ను, సాంస్కృతిక సంస్థ కార్యాలయాన్ని నిర్మించింది. లీజును పొడిగించుకుం టూ అయిదు దశాబ్దాల పాటు వాటిని కొనసాగించింది. 2007లో వాటిని తొలగించి, భారీ షా పింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. అదే సమయంలో మిగిలిన సత్రం భూమిలో దేవాదాయ శాఖ  కూ డా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. లీజు సంస్థ 75 షాపులు, దేవాదాయశాఖ 77 షాపులను నిర్మించాయి.  లీజు సంస్థ  అనుమతి లేకుండానే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంలో ఓ మాజీ మంత్రి చక్రం తిప్పారని, భారీ మొత్తం చేతులు మారిందని వినికిడి.
 
నామమాత్రపు లీజు.. లక్షల్లో అద్దెలు
లీజు సంస్థ 2007 నుంచి కేవలం స్థలానికి ఏడాదికి రూ.లక్షా 20 వేలు మాత్రమే చెల్లిస్తూ ఒక్కో షాపు నుంచి భారీగా అద్దెలు దండుకుంది. ఆ సంస్థ పైకి చూపిన దాని ప్రకారం షాపునకు నెలకు వసూలు చేసింది రూ.వెయ్యి మాత్రమే. ఆ లెక్కన చూసినా 75 షాపులకు నెలకు రూ.75 వేల చొప్పున ఏడాదికి 9 లక్షలు వసూలు చేసుకున్నట్టు. కానీ, సత్రానికి చెల్లించింది ఏడాదికి రూ.లక్షా 20 వేలు మాత్రమే.  
 
దేవాదాయ అధికారులదీ అదే దారి..
ఈ వ్యవహారం 2011లో వెలుగు చూడడంతో సత్రం ఈఓని బదిలీ చేసి, లీజు సంస్థ అధీనంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అనుమతి లేకుండా నిర్మించింది కావడంతో లీజు సంస్థ మిన్నకుండిపోయింది. షాపులను అద్దెకు తీసుకున్న వారు ప్రతి నెలా అద్దె సొమ్మును సత్రం ఖాతాలో జ మ చేయాలని దేవాదాయ శాఖ ఆదేశించినా.. ఈనాటి వరకూ వసూలు చేస్తున్న అద్దె ఎంత, ఏ ఖాతాలో ఎంత జమ చేస్తున్నారన్న దానిపై లెక్కాపత్రం లేవు. ఇప్పుడు అనుమతి లేకుండా నిర్మించిన ఈ షాపులను క్రమబద్ధీకరించాలని దేవాదాయశాఖ తలపెట్టింది.
 
అయితే.. దీన్నీ సొమ్ము చేసుకోవడానికి ఆ శాఖ అధికారులు ఆరాటపడుతున్నారు. నిజానికి ఆ శాఖ ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు లీజు సంస్థ నిర్మించిన కాంప్లెక్స్‌లోని 152 షాపులు గ త ఏడేళ్లలో ఎన్నో చేతులు మారాయి. ఆరు షా పులు కోర్టు కేసుల్లో ఉండగా మిగిలినన 146 షా పుల్లో 125 బినామీలే నడుపుతున్నారని, వారి లో దాదాపు 100 మంది నుంచి ఇప్పటికే క్రమబద్ధీకరణ పేరిట రూ.లక్ష చొప్పున రూ.కోటి వరకు వసూలు చేశారని సమాచారం. ఓ ఉదారుని ఆశయం పదిలంగా కొనసాగేలా చూ డాల్సిన దేవాదాయ అధికారులు దాన్ని నీరుగార్చడమే కాక శాఖ ఆదాయానికీ గండి కొడుతున్నారు.
 
ఇంతకీ దాత ఆశయాన్ని ఏ మేరకు కొనసాగిస్తున్నారని ఆరా తీస్తే.. పది నుంచి 15 మంది విద్యార్థులకు మాత్రమే మెస్‌లలో భోజ నం చేసేందుకు కూపన్లు ఇస్తూ రికార్డుల్లో ఆ సంఖ్యను పెంచి చూపుతున్నారని తెలిసింది. సత్రం నిర్వహణకు దాత ఇచ్చిన భూములూ అన్యాక్రాంతమయ్యాయని, అందులోనూ  అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి, అవినీతిపరులపై చర్యలు తీసుకుని, దాత లక్ష్యం నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది.
 
విచారణకు ఆదేశించాం : డీసీ
సత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల వ్యవహారంపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాదిరాజు సూరిబాబురాజును వివరణ కోరగా లీజు సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించడం వాస్తవమేనన్నారు. అలాగే అనేక షాపులు బినామీల చేతుల్లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చి, విచారణ జరపాలని తమ శాఖ తనిఖీదారు సతీష్‌కుమార్‌ను ఆదేశించామన్నారు. క్రమబద్ధీకరణకు ఎవరైనా అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న ఆయన.. లీజు సంస్థ వసూలు చేసిన మొత్తాన్ని రాబడతారా అన్నప్పుడు ‘చూద్దాం’ అని జవాబిచ్చారు.

మరిన్ని వార్తలు