హెచ్‌పీసీఎల్‌ను తేలిగ్గా వదిలేది లేదు

9 Sep, 2014 02:01 IST|Sakshi
హెచ్‌పీసీఎల్‌ను తేలిగ్గా వదిలేది లేదు

అనంతపురం రూరల్: ‘సిలిండర్‌పై 100 నుంచి 150 గ్రాములు వ్యత్యాసం ఉంది.. కనీసం నెల రోజులు కాకమునుపే సిలిండర్ అయిపోతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..  ఇంత దారుణంగా గ్యాస్‌ను పంపిణీ చేస్తే ఎలా’ అని మంత్రి పరిటాల సునీత హెచ్‌పీసీఎల్ ప్రతినిధులపై మండిపడ్డారు. హెచ్‌పీసీఎల్‌ను సీజ్ చేసిన విషయంపై ఆ సంస్థ చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ, ప్లాంట్ మేనేజర్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో కలిసి సోమవారం రాత్రి డ్వామా హాల్‌లో మంత్రి సమావేశమయ్యారు.   
 
తాను ఆకస్మికంగా తనిఖీ చేయగా 35 సిలిండర్లలో వ్యత్యాసం ఉందన్నారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు సదరు హెచ్‌పీసీఎల్ అధికారులు నీళ్లు నమిలారు.   మిషన్‌లో లోపం ఉందని సమాధానం చెప్పబోయారు. ఇన్ని రోజులుగా ఆ లోపాన్ని ఎందుకు సరిచేయలేదని ఆమె నిలదీశారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని చివరి అవకాశం ఇస్తున్నానన్నారు. గ్యాస్ తూకాల్లో వ్యత్యాసం వస్తే వదిలేప్రసక్తే లేదన్నారు.  తూనిక లు, కొలతల అధికారులు వచ్చి తనిఖీ చేసిన తర్వాతే సీజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నారు. ఐదు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారనే ఒక అడుగు వెనుక్కు తగ్గుతున్నామన్నారు. కార్మికుల వేతనాల విషయంలోనూ చాలా వ్యత్యాసం ఉందన్నారు. వారి శ్రమకు తగ్గ వేతనాలిస్తే బాగుంటుందన్నారు.  
 
జేసీ సత్యనారాయణ కలుగజేసుకుని లేబర్ యాక్ట్ నిబంధలను కచ్చితంగా పాటించాలని హెచ్‌పీసీఎల్ ప్రతినిధులకు తేల్చి చెప్పారు.  పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తూనికలు, కొలతల అధికారులు ఒక్కసారైనా వచ్చి తనను కలవలేదన్నారు. ఇందుకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. గ్యాస్ ఏజేన్సీలు, పెట్రోల్ బంకులు తనిఖీలు చేయమంటే సిబ్బంది తక్కువగా ఉన్నారన్న సమాధానం ఇస్తున్నారని తెలిపారు.  సమావేశంలో జెడ్పీఛైర్మన్ చమన్, డీఎస్‌ఓ ఉమామహేశ్వర రావు, డీఎం వెంకటేశం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు