భక్తజనకీలాద్రి.. నవరాత్రుల శోభ

30 Sep, 2019 06:47 IST|Sakshi

అంగరంగ వైభవంగా  ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

స్వర్ణకవచాలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ

దిగువన కృష్ణమ్మ పరవళ్లు.. ఎగువన దుర్గమ్మ దీవెనలు.. కొండంతా సంబరమే.. అల కైలాసం ఇల దిగినంత వైభోగమే.. జగన్మాత కనక దుర్గమ్మ స్వర్ణరూప ధారిణిగా సాక్షాత్కరించిన వేళ.. దేదీప్యమానమైన ఇంద్రకీలాద్రి భక్తకోటితో మరింత తేజోమయమైంది. నవరాత్రుల శోభ విజయవాడ నలుదిశలా పండువెన్నెలలా ప్రకాశించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణ కవచాలంకృత  దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆది దంపతుల నగరోత్సవం కనులపండువగా సాగింది.

ఇంద్రకీలాద్రి / విజయవాడ పశ్చిమ: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారి సన్నిధికి తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తజనకీలాద్రిగా మారింది.  తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల  అనంతరం అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు దంపతులు, నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ఫెస్టివల్‌ ఆఫీసర్‌ రామచంద్రరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు అమ్మవారి తొలి దర్శనం చేసుకొని తరించారు. అనంతరం  అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తరలించారు.  మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించారు. ఆలయ ఈవో, సీపీ దంపతులు ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కిటకిటలాడిన క్యూలైన్లు 
దసరా ఉత్సవాల తొలి రోజు, ఆదివారం కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్‌లో వేచిఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మల్లేశ్వరాలయం, మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకున్నారు.

లక్ష కుంకుమార్చన, శత చండీ హోమం 
మహామండపం ఆరో అంతస్తులో లక్ష కుంకుమార్చన, యాగశాలలో శత చండీహోమం నిర్వహించారు. పలువురు ఉభయదాతలు, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విశేష అర్చనలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సేవలో పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఐ.సీతారామమూర్తి, జస్టిస్‌ జి.శ్యామ్‌ప్రసాద్, గుంటూరు జిల్లా జడ్జి జస్టిస్‌ కె.వాసంతి, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎం.పద్మ దంపతులు, మంత్రి మోపిదేవి వెంకటరమణ దంపతులు, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

‘దసరా’లో ప్రత్యేక పూజలు ఇవే..
ఇంద్రకీలాద్రి:  దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఉత్సవాలు జరిగే పది రోజులు లక్ష కుంకుమార్చన, ఛండీయాగం నిర్వహిస్తారు. మహా మండపం ఆరో అంతస్తులో రెండు షిప్టుల్లో లక్ష కుంకుమార్చన జరుగుతుండగా, మొదటి షిప్టులో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రెండో షిప్టులో 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మల్లేశ్వరాలయానికి చేరుకునే మార్గంలోని యాగశాలలో ప్రతి రోజు 9 గంటల నుంచి ఛండీయాగం నిర్వహిస్తారు. ప్రతి నిత్యం జరిగే శ్రీచక్రనవార్చన దసరా ఉత్సవాల్లో యథావిధిగా జరిగినా భక్తులు పాల్గొనే అవకాశం లేదు. ఉత్సవాల పది రోజులు ప్రత్యేకంగా మహా మండపం ఆరో అంతస్తులో సూర్య నమస్కారాలు, బాలా, సుహాసిని పూజలు జరుగుతాయి.

మనోహరం.. కళార్చనం
విజయవాడ :  వికారినామ దసరా మహోత్సవాల్లో భాగంగా దేవదాయ శాఖ, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్లికార్జున మహామండపంలో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై ఆదివారం ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తిరంజనిలో భాగంగా  అమృత, నవ్య సిస్టర్స్, పి.ప్రమీల తదితరులు భక్తి గీతాలు, కీర్తనలను ఆలపించారు.

దుర్గమ్మకు నృత్య హారతి 
నృత్య కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులు భారతీయ నృత్య రీతులను ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్‌ అంశాలను కళాకారులు మనోహరంగా అభినయించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి. నాట్యాచార్యులు మునిపల్లి నాగమల్లి, సప్పా శివకుమార్, దావులూరి అపర్ణ, ఎం.అనూషా నాయుడు తదితర బృందాలు అన్నమయ్య కీర్తనలు, జయదేవుని అష్టపదులు, రామదాసు కీర్తనలకు నృత్యాలను అభినయించాయి. నిర్వాహకులు కళాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

నేటి కార్యక్రమాలు  
ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు భక్తిరంజని, శాస్త్రీయ సంగీతం, వయోలిన్, మృద ంగం కార్యక్రమాలు సాగుతాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కూచిపూడి, భరతనాట్యం అంశాలను ప్రదర్శిస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా