నేటి నుంచి ఈ-పేమెంట్స్

1 Sep, 2014 00:30 IST|Sakshi
నేటి నుంచి ఈ-పేమెంట్స్

సాక్షి, కాకినాడ : ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డు ఉద్యోగుల పింఛన్లతో పాటు ఇతర చెల్లింపులన్నీ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. సెప్టెంబర్  జీతభత్యాలు, పింఛన్‌ల చెల్లింపులతో ఈ ప్రక్రియకు జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 57,674 మంది ఉద్యోగులు, 38,223 మంది పింఛన్‌దారులున్నారు. వీరందరికీ సంబంధిత శాఖల నుంచి ప్రతి నెలా 20 కల్లా డీడీఒలు జీతభత్యాలు, పింఛన్ బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపేవారు. ఖజానా సిబ్బంది ఆడిట్ చేసి బ్యాంకులకు షెడ్యూళ్లు సమర్పిస్తే వారు ఉద్యోగుల  ఖాతాలకు సొమ్ము జమచేసేవారు. ఈ ప్రక్రియ కోసం 20 నుంచికసరత్తు చేస్తే తప్ప ప్రతి నెలా మొదటి వారానికి వారి ఖాతాల్లో సొమ్ములు జమయ్యేవి కావు.
 
 సోమవారం అమలులోకి వస్తున్న ఈ-పేమెంట్స్ విధానంలో బ్యాంకుల ప్రమేయం ఉండబోదు. ట్రెజరీ నుంచే నేరుగా ఉద్యోగులు, పింఛన్‌దారుల ఖాతాలకు సొమ్ము జమవుతుంది. దీని వల్ల ప్రతి నెలా ఒకటినే ఠంచన్‌గా జీతభత్యాలతో పాటు పింఛన్ల మొత్తం కూడా వ్యక్తిగత ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా గత ఏప్రిల్‌లోనే కాకినాడలోని జిల్లా ట్రెజరీ ప్రధాన కార్యాలయం పరిధిలోకి వచ్చే ప్రభుత్వశాఖల్లో అమలు చేయనారంభించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు 010 పద్దు ద్వారా వేతనాలు పొందుతున్న అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తింపచేశారు. ఏప్రిల్ నుంచి జిల్లాలో సుమారు 10 వేల మంది ఉద్యోగులకు ఈ- చెల్లింపులు జరుగుతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలోని 18 సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.  
 
 జీతభత్యాలు, పింఛన్లే కాక ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగే ఇతర ఖర్చులు కూడా ఈ- చెల్లింపుల ద్వారానే జరుగుతాయి. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెలా జీతభత్యాల కింద రూ.180 కోట్లు, పింఛన్ల కింద రూ.80 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇతర ఖర్చులు (అద్దెలు, విద్యుత్, టెలిఫోన్, స్టేషనరీ తదితరాలు) మరో రూ.50 కోట్ల వరకు ఉంటాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి ఇవన్నీ ఈ-పేమెంట్స్ ద్వారా జరపనున్నారు. స్థానిక సంస్థలైన జెడ్పీ, మండల పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో చెల్లింపులు మాత్రం ప్రస్తుతానికి పాతపద్ధతిలోనే జరుగుతాయి. వీటిని కూడా రెండు మూడు నెలల్లో ఈ- పేమెంట్స్ కిందకు తీసుకొచ్చే కసరత్తు జరుగుతోందని జిల్లా ఖజానాధికారి అధికారి లలిత ‘సాక్షి’కి తెలిపారు.
 

మరిన్ని వార్తలు