‘ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలి ’

28 Jan, 2020 18:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలోని ప్రతి పౌరుడు మూడు మొక్కలు నాటాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో ప్రగతి భారతి ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకే ప్రగతి భారతి పౌండేషన్‌ ప్రారంభించామని వెల్లడించారు. కాలుష్యాన్ని అరికట్టాలిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. ఏపీని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది మొక్కలు నాటాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని, దానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం అందమైన నగరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత నగర పౌరులదే అన్నారు.

ఏపీ అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారాలన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. విశాఖ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, 1926లో తొలి విశ్యవిద్యాలయం (ఆంధ్రా యూనివర్శిటీ) ఇక్కడే ఏర్పడిందని గుర్తు చేశారు.  దేశంలోనే తొమ్మిదవ పెద్ద నగరంగా ఉన్న విశాఖను  ప్రకృతి, పర్యావరణానికి కేరాఫ్‌గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

అది తప్పకుండా అమలు అవుతుంది
విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా సీఎం జగన్‌ ప్రకటించారని, అది తప్పకుండా అమలు అవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కొందరు అడ్డంకులు సృష్టించినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎవరు అడ్డొచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదని చెప్పారు. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమో కాదో తనకు తెలియదన్నారు. భూములు పోతాయనే భయంతో  రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, సుజనా కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా అవతరించి తీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు