ఉడికిన పీత..లాభాలమోత

15 Dec, 2019 05:03 IST|Sakshi

పీతల్ని ఉడికించి విదేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు

తూర్పు గోదావరి తీరం నుంచి విదేశాలకు జోరుగా వ్యాపారం

పచ్చి పీతల్లో తొందరగా పాడయ్యే లక్షణం

ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్న ఉడికించిన పీతలు.. రుచిలోను శ్రేష్టం

పిఠాపురం: సముద్ర పీతలు.. ఒకసారి తింటే ఆ రుచి మరచిపోలేం.. ఇక మన రాష్ట్ర తీరంలో దొరికే సముద్ర పీతలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. కొన్ని రకాల పీతల ధర విదేశాల్లో కిలో వేలల్లో ఉంది. మత్స్యకారులు, వ్యాపారులకు లాభాల పంట పండిస్తున్న ఈ పీతలు ఎగుమతికి అంత అనుకూలం కాకపోవడంతో.. ఐస్‌లో ఎంత పకడ్బందీగా పంపినా కొన్నిసార్లు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు పరిష్కారం కనుగొన్నారు. అదే పీతల్ని ఉడికించి ఎగుమతి చేయడం. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు రుచిలో కూడా శ్రేష్టంగా ఉండడంతో ఈ విధానంలో ఎగుమతులు జోరందుకున్నాయి. సముద్ర పీతల ధర మన వద్ద కిలో రూ. 350 నుంచి రూ. 500 ఉంటే.. విదేశాల్లో రూ.5 వేల వరకూ పలుకుతుంది. బ్లూ క్రాబ్, త్రీస్పాట్‌ క్రాబ్, పచ్చ పీత, మండ పీత, జీలా పీత, చుక్క పీత తదితర రకాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

తూర్పుగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల నుంచి రోజూ సుమారు 20 నుంచి 25 టన్నుల పీతలు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా, మలేషియా, థాయిలాండ్‌ దేశాల్లో జీలా రకం పీతలకు క్రేజ్‌ ఎక్కువ. సాధారణంగా పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అమెరికా లాంటి దేశాలకు పంపాలంటే ఎక్కువ రోజుల నిల్వ చేయాల్సి రావడంతో ఎగుమతులు తక్కువగా ఉండేవి. పీతల్ని ఉడకబెట్టడం ద్వారా అవి ఎక్కువకాలం పాడవకుండా ఉండడాన్ని గుర్తించారు. దీంతో వేటాడి తెచ్చిన పీతలను కొనుగోలు చేసిన వ్యాపారులు తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాల్లో ఉడకబెట్టి, ఐస్‌ బాక్సుల్లో ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈ పీతలు కాకినాడ నుంచి ముంబయి, చెన్నై వంటి నగరాల్లోని కంపెనీలకు ప్రత్యేక కంటైనర్లలో తరలించి అక్కడి నుంచి విమానాల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

పీతల వేటకు పెట్టుబడి ఎక్కువే..
పీతల్లో మొత్తం 7,693 రకాలున్నాయి. మన వద్ద 10 నుంచి 15 రకాలు మాత్రమే దొరుకుతాయి. పీతల్ని పట్టాలంటే బలమైన వలలు అవసరం. ఒక్కోసారి వల ఎంత గట్టిగా ఉన్నా.. పీతల డెక్కల నుంచి రక్షించడం కష్టం. అందుకే పీతల వేటకు ప్రత్యేక వలలు ఉపయోగిస్తారు. ఒక వల రెండు మూడు వేటల కంటే ఎక్కువ ఉపయోగపడదు. అందువల్లే వీటి వేటకు పెట్టుబడి ఎక్కువ. ఒకసారి పాడైతే అవి మరమ్మతులకు కూడా పనికిరావు. చేపల వేటకైతే 20 నుంచి 30 వేటల వరకు వల పనికొస్తుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు పీతల కోసం ప్రత్యేక వలలు వేస్తారు. కొంచెం లోతుగా
ఉండే ప్రాంతాల్లో పీతలు ఎక్కువగా దొరుకుతాయి. ఆ ప్రదేశాల్లో ఎక్కువ పీతలు పడితే ఆ రోజు పంట పండినట్లే. అర కేజీ నుంచి సుమారు రూ.8 కేజీల బరువైన పీతలు దొరుకుతాయి.

మాంసాన్ని వేరు చేసి ఎగుమతులు
విదేశాల్లో పీతల్ని కాకుండా.. వాటి నుంచి వేరు చేసిన మాంసాన్ని కొనుగోలు చేస్తారు. దీంతో పీతల అవయవాల్ని బట్టి రేటు మారుతుంది. డెక్కల్లో మాంసానికి ఒక రేటు, కడుపు భాగంలో మాంసానికి మరో రేటు పలుకుతుంది. మన తీరప్రాంతంలో కొన్న పీతలను ఉడకబెట్టి.. ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలిస్తారు. అక్కడ వాటిని శుభ్రం చేసి డిప్పలు, డెక్కలు పూర్తిగా తొలగించి కేవలం మాంసాన్ని మాత్రమే ఎగుమతి చేస్తారు. విడివిడిగా ప్యాకింగ్‌లు చేసి విదేశాలకు పంపుతారు.

గిరాకీ పెరిగింది
ఉప్పాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రతీ రోజు సుమారు టన్ను వరకు పీతలు కొనుగోలు చేస్తున్నారు. వేట ఎక్కువ ఉంటే 2 నుంచి 5 టన్నుల వరకు పీతలు కొంటున్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పీతలను కంటైనర్‌ ద్వారా చెన్నై, ముంబయిల్లోని ఫ్యాక్టరీలకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మేము అమ్మే కంపెనీలు పీతల్ని అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.
– మల్లిబాబు, పీతల వ్యాపారి, ఉప్పాడ

జోరుగా ఎగుమతులు
గతం కంటే పీతల ఎగుమతులు పెరిగాయి. ఉడకబెట్టి ప్యాకింగ్‌ చేయడం వల్ల పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు నాణ్యంగా ఉంటాయి. అందువల్లే విదేశాల్లో వీటికి గిరాకీ పెరిగింది. ఈ పీతల రకాలు మన తీర ప్రాంతంలోనే లభ్యమవుతాయి. చెరువుల్లో పెంచే పీతలకంటే సముద్ర పీతలకు గిరాకీ ఎక్కువ. ఉప్పాడ, కాకినాడ, అంతర్వేది తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని కేజీల లెక్కన కొంటున్నారు. జీలా రకం పీత ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి.
–శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ, కాకినాడ

మరిన్ని వార్తలు