మహేంద్ర మృతిపై సీఐడీ విచారణ

18 Nov, 2023 05:02 IST|Sakshi

హోం మంత్రి తానేటి వనిత వెల్లడి

నిజాలు నిగ్గు తేల్చేందుకే విచారణ

దురుద్దేశంతోనే జనసేన నేతల అసత్య ఆరోపణలు

కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో బొంత మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైఎస్సా­ర్‌సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని అన్నారు.

మంత్రి శుక్ర­వారం ఇక్కడ విలేక­రుల సమావేశంలో మాట్లా­డుతూ ‘పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే స్టేషన్‌కి ఫోన్‌ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించాను. తర్వాత మహేంద్రను ఇంటికి పంపారు. మహేంద్ర పురుగుమందు తాగినట్లు తర్వాత రోజు తెలిసింది. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో నేనే మాట్లాడాను. తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్‌ డీఐజీ ఫోన్‌ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పారు.

మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా  నేనే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశాను. మహేంద్ర మృతదేహం వచ్చే సమయానికి నాయకులతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి నా కాన్వాయ్‌పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారు’ అని చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్‌ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హోంమంత్రి చెప్పారు. మహేంద్ర మృతిలో నిజాలు నిగ్గుతేలాలంటే సీఐడీ విచారణ చేయించాలని తాను సీఎం వైఎస్‌ జగన్‌ను కోరానని, వెంటనే చేయిస్తానని సీఎం  హామీ ఇచ్చారని తెలిపారు. 

మరిన్ని వార్తలు