నీకెందుకు డబ్బులు వేయాలి?

10 Jan, 2020 10:53 IST|Sakshi
చంద్రబాబు డబ్బులు అడగటంతో ఎందుకయ్యా అని ప్రశ్నిస్తున్న మహిళ

సాక్షి, మచిలీపట్నం:చంద్రబాబు మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగసభ జనం లేక వెలవెలబోయింది. టీడీపీ అధినేత విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు మీదుగా బందరు చేరుకున్నారు. దారిపొడవునా ఎక్కడా జనస్పందన లేకపోగా.. మచిలీపట్నం సభకు సైతం జనం రాకపోవడంతో కంగుతిన్నారు. కోనేరు సెంటర్‌లో సభ ప్రారంభం కావాల్సిన మధ్యాహ్నం మూడుగంటల సమయానికి పట్టుమని 200 మంది లేకపోవడంతో టీబ్రేక్‌ పేరిట సుల్తాన్‌పురం వద్దే ఆగిపోయారు. సాయంత్రం 4.15 గంటలకు బందరు చేరుకున్నారు. అయినా జనం లేకపోవడంతో భిక్షాటన పేరిట కోనేరు సెంటర్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ వృద్ధురాలి వద్దకెళ్లి డబ్బులు వేయాలని అభ్యర్థించగా.. నీకెందుకేయాలి? ఏం చేశావని వేయాలి? అని ఆమె నిలదీసింది. అమరావతి కోసమని చంద్రబాబు బదులిస్తుండగా.. ఏమైనా కట్టావా? అని ఆమె ఎదురు ప్రశ్నించడంతో చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సభలో అమరావతికి జై కొట్టాలని పదేపదే అభ్యర్థించినా జనం నుంచి స్పందన లేకపోయింది.

అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.లక్షా 10 వేల కోట్లు అవసరమేనని ప్రతిపక్ష నేత ఎన్‌.చంద్రబాబు నాయుడు అన్నారు. అంత డబ్బు మన దగ్గర లేదన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఆ డబ్బులు ఇప్పటికిప్పుడు అవసరం లేదని ముక్తాయించారు. విశాఖ వాసులు కాదు కదా.. ఉత్తరాంధ్ర వాసులు కూడా తమకు రాజధాని కావాలని కోరుకోవట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం తమ భూములను కాపాడుకునేందుకే అక్కడకు రాజధాని తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మచిలీపట్నంలో చంద్రబాబు జోలిపట్టి భిక్షాటన చేశారు. అనంతరం కోనేరు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ బంగారు బాతు గుడ్లు పెట్టే అమరావతిని చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. పైసా ఖర్చు లేకుండా భూములు సమీకరించామని, పైసా ఖర్చు లేకుండానే రాజధాని కూడా నిర్మించుకోవచ్చని, ఆ తెలివితేటలు వారికి లేకపోవడం వల్లే ఈ పరిస్థితేర్పడిందని విమర్శించారు. ‘మీకు రోషం లేకపోవడం వలనే వాళ్లు అలా మూడుముక్కలాట ఆడుతున్నారు.

మీరంతా రోడ్డెక్కితే అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకేదో వయస్సు అయిపోయిందంటున్నారు. నాకు ఉద్యోగం లేదని ఎగతాళి చేస్తున్నారు. నాకేమైనా ఉద్యోగం కావాలా? నా రికార్డుల్ని ఎవరూ బ్రేక్‌ చేయలేరు. మీ జీవితాలను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక రోడ్డెక్కా’’ అని అన్నారు. హైదరాబాద్‌ తానే కట్టానని, ఎయిర్‌పోర్టు, సైబరాబాద్, అవుటర్‌ రింగ్‌రోడ్‌ కూడా తానే నిర్మించానని, అయినా విభజన తర్వాత తెలంగాణలో తనను ఓడించారని, అలాగే నవ్యాంధ్రకోసం హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని తీర్చిదిద్దాలని శ్రమించానని, కానీ ఇక్కడి ప్రజలు కూడా తనను ఓడించారని చంద్రబాబు వాపోయారు. అయినా తాను బాధపడట్లేదని, మీ భవిష్యత్‌ కోసమే ఉద్యమిస్తున్నానని చెప్పారు. తాను చేస్తున్న ఈ ఉద్యమానికి ఇంటికొకరు చొప్పున మద్దతునివ్వాలన్నారు. ఈ సందర్భంగా జోలిపట్టి సేకరించిన రూ.3.10 లక్షలను అమరావతి జేఏసీ నేతలకు అందజేశారు. çసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు