ఓట్ల పండుగ వచ్చేసింది

11 Mar, 2019 10:40 IST|Sakshi

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల 

సిక్కోలులో సందడి వాతావరణం

జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు పోరు  

సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు మొదటి విడతగా ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరిపేందుకు ఎన్నికల కమిషన్‌  మూహూర్తం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో మరింత వేగం చేస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉంది.  శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, వీటిలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నంలు ఉన్నాయి. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో పాలకొండ అసెంబ్లీ నియోజవర్గం ఉండగా,  రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి.


జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు (మండలాల వారీగా)
శ్రీకాకుళం   :  శ్రీకాకుళం అర్బన్, శ్రీకాకుళం రూరల్, గార  
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట  
పలాస : పలాస, మందస, వజ్రపుకొత్తూరు 
టెక్కలి: టెక్కలి, కోటబోమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం
నరసన్నపేట: నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట 
ఆమదాలవలస: ఆమదాలవలస, పొందూరు,బూర్జ, సరుబుజ్జిలి  
పాతపట్నం: పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, కొత్తూరు  
పాలకొండ : పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని 
రాజాం: రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి ఆమదాలవలస 
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం


జిల్లాలో ఓటర్లు 20,64,330 మంది..
శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,57,096 మంది ఓటర్లు ఉండగా, జిల్లా నుంచి అరకు పార్లమెంటుకు పాలకొండ నియోజకవర్గం నుంచి 1,74,219 మంది ఓటర్లు ఉన్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల నంచి  4,33,015 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  జిల్లాలో మొత్తం ఓటర్లు 20,64,330 మంది కాగా, వీరిలో పురుషులు 10,35,623 మంది, స్త్రీలు 10,28,460 మంది, ఇతరులు 247 మంది ఉన్నారు. ఇంకా ఓటర్ల  నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో వారం రోజుల పాటు నమోదుకు గడువు ఉంది. ప్రసుతం ఉన్న ఓటర్లకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ కొత్తగా ఓటర్లు చేరే అవకాశం ఉంది.

సిక్కోలు నైసర్గిక స్వరూపం..
జిల్లా  5,837 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన, ఉత్తరాన ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన విజయనగరం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా ఒడిశాకు దగ్గరలో ఉన్నందున భిన్న సంస్కృతులు కలిగి ఉంది.  ప్రధానంగా వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులు ఉన్నాయి. మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు ఉన్నాయి. 


జనాభా..
జిల్లాలో ప్రస్తుత జనాభా సుమారు 30 లక్షల మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా 27,03,114 మంది ఉన్నారు. వీరిలో 13,41,738 పురుషులు ఉండగా,  13,61,376 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో 62.3 శాతం మంది అక్షరాష్యులు ఉన్నారు.


సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లు..
జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2084 ప్రాంతాల్లో 2908 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి, వీటిలో 1025 ప్రాంతాల్లో 1523 పోలింగ్‌ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లుగా గుర్తించారు. వీటి పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి.


ప్రజాస్వామ్య వ్యవస్ధను కాపాడేవారికే ఓటు
సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేవారికే ఓటు వేయాలి. దేశ భవిష్యత్‌ను మార్చగలిగే సత్తా మన ఓటుకు ఉంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. ఎన్నికల సమయంలో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అర్హులైనవారినే ఎన్నుకుందాం.
– దత్తి మురళీకృష్ణ, ప్రైవేటు వైద్యుడు, వీరఘట్టం

మరిన్ని వార్తలు