అనుమానాస్పద స్థితిలో విద్యుత్ ఉద్యోగి మృతి

26 May, 2015 02:37 IST|Sakshi

లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని లీలావతి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమ సమీపాన ఉన్న ఊట బాబిలో ప్రొద్దుటూరు వాసి మృతదేహం బయట పడింది. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యు.ఓంకార్  అచ్యుతానందరెడ్డి(37) ముద్దనూరులోని ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అసిస్టెంటు లైన్‌మెన్‌గా పని చేసేవాడు. ఈయన లింగాల మండలం అక్కులగారిపల్లెకు చెందిన ఓబుళమ్మను 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈయనకు చిన్ని(3), వేణుగోపాల్‌రెడ్డి(5) అనే కుమారులు ఉన్నారు. ఆయన భార్య, పిల్లలతో కలిసి అత్తగారింటికి గత ఆదివారం వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళుతున్నానని ముద్దనూరు వెళ్లారని, మంగళవారం ప్రొద్దుటూరులో ఉన్నారని.. తాను అక్కులగారిపల్లెకు రాలేనని భార్యకు ఫోన్ చేసినట్లు సమాచారం.
 
 డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి..
 ఆ తర్వాత భార్యకు గానీ, ఆయన తల్లిదండ్రులకు కానీ ఫోన్ చేయలేదు. అత్తారింటికి వెళ్లారని ఆయన తల్లిదండ్రులు.. డ్యూటీలో ఉన్నారని భార్య భావించారు. అయితే ఆయన సోమవారం శవమై బావిలో కనిపించారు. 5 రోజుల క్రితమే ఆయన బావిలో పడ్డారని, సోమవారం మృతదేహం నుంచి దుర్గంధం వాసన వస్తుంటే పక్క తోట రైతు ప్రభాకర్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పాడుబడ్డ ఊట బావిలోకి దిగేందుకు వీలులేక భారీ పొక్లెయిన్‌ను తెప్పించి సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీశారు.
 
 ఆయన జేబులో ఉన్న ఐడీ కార్డులను పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఓంకార్ అచ్చుతానందరెడ్డి మద్యం సేవించి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వచ్చి పొరపాటున బావిలో పడ్డారా..లేక ఎవరైనా హత్య చేసి బావిలో పడవేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతిగా మద్యం సేవించి రోడ్డు వెంట నడుచుకుంటూ నాలుగు రోజుల క్రితం కనిపించారని ఇక్కడ ప్రజలు ఎస్‌ఐ తిమ్మారెడ్డికి తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, దర్యాప్తు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్‌వో లూక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు