ఉద్యోగులకు పెన్షన్ కల్పించలేని పాలకులు సిగ్గుపడాలి

30 Sep, 2013 00:42 IST|Sakshi
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ :ప్రజాసేవలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ భద్రత కల్పించలేకపోవడానికి పాలకులు సిగ్గుపడాలని ఆలిండియా ఫెడరల్ యూనియన్ ఆఫ్ కాలేజ్ టీచర్‌‌స ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌యూ సీటీఓ) మాజీ అధ్యక్షుడు, ‘టీచర్స్ ఆఫ్ ద వరల్డ్’ చీఫ్ ఎడిటర్ డాక్టర్  కేకే తీకేదత్ అన్నారు. 2015 వరకు అందరికీ విద్య అనే కలను సాకారం చేసే మహాయజ్ఞంలో ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ విద్యా సదస్సు ఆదివారం నల్లగొండలో ప్రారంభమయింది. స్థానిక జూనియర్ లెక్చరర్స్ భవన్‌లో జరిగిన సదస్సులో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రారంభోపన్యాసం చేశారు. 
 
 సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఉపాధ్యాయుల, ఉపాధ్యాయ సంఘాల పాత్ర అనే అంశంపై ఆయన చర్చించారు. అనంతరం ప్రధాన వక్తగా హాజరైన తీకేదత్ ప్రసంగిస్తూ, 2004 తర్వాత మనదేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని ఎత్తివేయడాన్ని వివరించారు. పాలకులు నియో లిబరల్ విధానాలను అవలంబిస్తున్నారన్నారు. పెట్టుబడిదారి సమాజం అనారోగ్యకర పరిస్థితుల్లో మునిగిపోతున్నప్పుడు ప్రత్యామ్నాయం సోషలిజానిదేనన్నారు. సోవియట్ యూనియన్‌లో విభజన రాగానే అంతా అయిపోయినట్లుగా ప్రచారం చేశారని, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. 2002 నుంచి పెట్టుబడిదారి సమాజం క్లిష్ట పరిస్థితులెదుర్కొంటున్నదన్నారు. బ్యాంక్‌లు మూతబడ్డాయన్నారు. అమెరికా లాంటి సామ్రాజ్యావాద దేశాలు ఒకానొక దశలో బిలియన్ డాలర్ల సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 
 
 ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకుందాం
 ప్రజల పన్నులతో నడుస్తున్న ప్రభుత్వ విద్యావ్యవస్థను రక్షించుకొని బలోపేతం చేయాలని పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యావేత్త ప్రొఫెసర్ మృణ్మయ్ భట్టాచార్య అన్నారు. ఉపాధ్యాయుల అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. మంచి, నాణ్యమైన విద్య అవసరమన్నారు. విద్యా ద్వారానే సమానత్వం సాధ్యమన్నారు. మనదేశంలో చాలా పాఠశాలల్లో మౌలిక సౌకర్యలు లేకపోవడం, అనేక ప్రాథమిక పాఠశాలలకు సొంత, పక్కా భవనాలు లేకపోవడం విచారకరమన్నారు. ఈ సదస్సుకు మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల నుంచి ఉపాధ్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. 30న నల్లగొండ సమీపంలోని ఎంజీ యూని వర్సిటీ ఆడిటోరియంలో విద్యా సదస్సు జరుగు తుందని ప్రతినిధులు తెలిపారు. 
మరిన్ని వార్తలు