అమెజాన్‌ ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌!

17 Nov, 2023 13:08 IST|Sakshi

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారంలో మూడు రోజులు ఆఫీస్‌ నుంచి పనిచేసేందుకు సిద్ధంగా లేని సిబ్బంది ప్రమోషన్లను నిలిపి వేస్తామని చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ విధానాన్ని ప్రోత్సహించేలా అమెజాన్‌ యాజమాన్యం మేనేజర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, కెరీర్‌ పరంగా ఉన్నత స్థానాల్లో ఉండాలనుకునే ఉద్యోగులు వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ తప్పని సరి చేసింది. కాదు కూడదు అంటే గల కారణాల్ని వివరిస్తూ వైస్‌ ప్రెసిడెంట్‌ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

 

ప్రమోషన్‌ కావాలా? అయితే ఆఫీస్‌కి రండి
అంతేకాదు, ఉద్యోగుల ప్రమోషన్ల బాధ్యతలను ఆయా విభాగాల మేనేజర్లకు అప్పగించింది. ఉద్యోగులతో చేయించే రోజూవారీ ఆఫీస్‌ పనులతో పాటు, ప్రమోషన్లకు తగిన అర్హతల్ని గుర్తించాలని చెప్పింది. కార్యాలయాల్లో పని చేసేందుకు మొగ్గు చూపే ఉద్యోగులు ప్రమోషన్లు, ఇతర అంశాలపై వైస్‌ ప్రెసిడెంట్‌ అనుమతి తీసుకోవాల్సి అవసరం లేదని, ఆ బాధ్యతల్ని సైతం మేనేజర్లే చేస్తారని అమెజాన్‌ ఉద్యోగులకు ఓ ఇంటర్నల్‌ ఇ-మెయిల్‌ పంపింది. 

ఈ ఏడాదిలో కొత్త వర్క్‌ పాలసీ
అమెజాన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలంటూ కొత్త వర్క్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పని విధానం మే నెల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

వేలాది మంది ఉద్యోగుల నిరసన
అయితే  ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 30 వేల మంది ఉద్యోగులు గత మే నెలలో సియోటెల్‌లో ఉన్న  అమెజాన్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సంస్థ తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డ్‌లను ప్రదర్శించారు. 

మీ అంగీకారంతో పనిలేదు
ఆగస్ట్‌ నెలలో ఉద్యోగుల ఆందోళనపై సీఈవో ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. గతంలో ‘ మీరు కొత్త వర్క్‌ నిబంధనల్ని అంగీకరించలేదు. అలా అని కట్టుబడీ లేరు. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వారానికి మూడు రోజులు ఉద్యోగులు ఆఫీస్‌కు తప్పని సరిగా రావాల్సిందే’నని హెచ్చరించారు. తాజాగా, సిబ్బంది ఆఫీస్‌కు రావాలని, లేదంటే వారి ప్రమోషన్లను నిలిపివేస్తామని మరోసారి మెయిల్స్‌ పంపడంతో అమెజాన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇతర సంస్థలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 

మరిన్ని వార్తలు