ముగిసిన కళానీరాజనం

22 Jul, 2014 03:58 IST|Sakshi
ముగిసిన కళానీరాజనం

తిరుపతి కల్చరల్ : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన కళానీరాజనం తుది విడత పోటీ లు సోమవారంతో ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ మాట్లాడుతూ దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కళానీరాజనం సంగీత పోటీలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమశ్రేణి కళాకారులను గుర్తిస్తామని తెలిపారు.  

క్షేత్రస్థాయిలో ఎంపిక చేసిన కళాకారుల వివరాలను నిక్షిప్తం చేసి, నాదనీరాజనం, శ్రీవారి సేవలు, టీటీడీ ఆలయాల ఉత్సవాల్లో అవకాశం కల్పిస్తామన్నారు. సంగీత పోటీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఒకవైపు వేర్వేరు ప్రాంతాల్లో పోటీలు నిర్వహణ, మరో వైపు ఎంపికైన వారికి టీటీడీ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించడం సమాంతరంగా జరుగుతుందన్నారు. సంగీత పోటీలు నిర్వహించడం ద్వారా మన సం స్కృతి పరిరక్షణకు ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు.

కళానీరాజనంలో ప్రతిభ కనబరిచిన  మొదటి శ్రేణి కళాకారులకు ప్రతిష్టాత్మకమైన నాదనీరాజనం కార్యక్రమంలో, రెండో శ్రేణి వారికి తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహించే  ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకారసేవ వంటి సేవల్లో, మూడో శ్రేణిలోనున్న వారికి టీటీడీ ఆలయా ల్లో నిర్వహించే అన్ని ఉత్సవాల్లో ప్రదర్శనలకు అవకాశమిస్తామని తెలిపారు. పోటీల న్యాయనిర్ణేత ప్రముఖ వీణ విద్వాంసుడు పుదుక్కోటై ఆర్.కృష్ణమూర్తి మాట్లాడుతూ వర్తమాన కళాకారులకు స్వరజ్ఞానం అవసరమన్నారు.

మంచి గురువు సమక్షంలో చక్కగా సాధన చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. ప్రముఖ సంగీత విద్యాంసుడు అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ ఎంత నేర్చుకున్నా కళాకారులు నిరంతరం సాధన చేస్తూ నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. కాగా, చివరిరోజు ఉద యం నిర్వహించిన సంగీత, వాయిద్య పోటీల్లో చిత్తూరుకు చెందిన 15 మంది యువకళాకారులు  ప్రతిభ చాటారు.

మధ్యాహ్నం చేపట్టిన  నృత్య ప్రదర్శనల్లో మరో 15 మంది కళాకారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో చక్కటి ప్రతిభా పాటవాలతో అలరించారు. ప్రముఖ సంగీత విద్యాంసులు కన్యాకుమారి, పుదుక్కోటై రామనాథన్, దేవేంద్రపిళ్ళై, డాక్టర్ శర్మ ఉషారాణి, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శబరిగిరీష్, వందన న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. డీపీపీ ప్రత్యేక అధికారి రఘునాథ్, ట్రాన్స్‌పోర్టు జీఎం పీవీ. శేషారెడ్డి, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ వైవీఎస్.పద్మావతి, ఎస్వీబీసీ తమిళ ప్రసారాల అధికారి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు