ఎట్టకేలకు పంచలోహ విగ్రహాలకు విముక్తి

27 Sep, 2018 13:54 IST|Sakshi
రాచాయపేట సోమేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాలను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

40 ఏళ్లుగా మాజీ ధర్మకర్త ఇంట్లో విగ్రహాలు

వీటి విలువ రూ.70 లక్షలకు పైగానే

రెవెన్యూ, పోలీసు, గ్రామస్తుల సహకారంతో

విగ్రహాలను స్వాధీనం చేసుకున్న దేవాదాయశాఖ

గోపవరం : కారణాలు ఏవైనా గత 40 సంవత్సరాలుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలకు విముక్తి లభించింది. పంచలోహ విగ్రహాలకు సంబంధించి సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మండలంలోని రాచాయపేటలో వెలసి ఉన్న పురాతన సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలైన పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ, ఇతర పూజా సామాగ్రిని దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు బద్వేలు ఇన్‌ఛార్జి ఈఓ వెంకటరమణారెడ్డి, సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలు గత 40 ఏళ్లుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్నట్లు గ్రామస్తులకు గాని సంబం«ధితశాఖ అధికారులకు గాని సమాచారం లేదు. అసలు పంచలోహ విగ్రహాలు ఉన్నాయన్న విషయం కూడా గ్రామస్తులకు తెలియదు. పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ వీటి విలువ రూ.70 లక్షలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. ఇటీవల మాజీ ధర్మకర్త భార్య అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు బీరువా తెరువగా అందులో పంచలోహ విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు.

దీంతో వారు ఆశ్చర్యానికి గురై ఆగమేఘాల మీద సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేసి విగ్రహాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అయితే ఇంత విలువైన విగ్రహాలు ఆలయానికి ఉన్నట్లు దేవాదాయశాఖ రికార్డుల్లో లేవు. కేవలం భూములు ఉన్నట్లు మాత్రమే రికార్డుల్లో పొందుపరిచారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు వెనకడుగు వేశారు. అయితే విగ్రహాలను స్వాధీనం చేసుకునే అంశంపై స్థానిక అధికారులపై మాజీ ధర్మకర్త కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు దేవాదాయశాఖ కమిషనర్‌ విగ్రహాలను స్వాధీనం చేసుకుని భద్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం రెవెన్యూ, పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో పంచలోహ విగ్రహాలకు పంచనామా నిర్వహించి దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలను బద్వేలు గోవిందయ్యమఠంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో భద్రపరిచారు. విగ్రహాల వివరాలు, పంచనామా నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఈఓ తెలిపారు. పంచనామాలో గోపవరం డిప్యూటీ తహసీల్దారు మధురవాణి, బద్వేలు రూరల్‌ ఎస్‌ఐ హేమాద్రి, వీఆర్‌ఓలు జగదీశ్వర్‌రెడ్డి, నరసింహులు, జెడ్పీటీసీ రమణయ్య, మాజీ ధర్మకర్త రాజగోపాల్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు