విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు

12 Jun, 2020 19:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడిలోని ఏసీబీ సెంట్రల్‌ ఆఫీసుకు ఏసీబీ అధికారులు ఆయనను తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అచ్చెన్నాయుడుతోపాటు అరెస్టైన మరో ఐదుగురిని కూడా ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
(చదవండి: ‘అరెస్ట్‌ చేస్తే కిడ్నాప్‌ ఎలా అవుతుంది?’)

155 కోట్ల రూపాయల అవినీతి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇటీవల నివేదికను విడుదల చేసింది. కేసు విచారణలో భాగంగానే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెండర్లు పిలవకుండా నామినేషన్‌ పద్దతిలో అచ్చెన్నాయుడు చెప్పిన కంపెనీకు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలో తేలింది. మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది.
(చదవండి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌)

మరిన్ని వార్తలు