అన్నదాతల ఆగ్రహం

11 May, 2014 02:12 IST|Sakshi

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయూలని ఆందోళన
 
 న్యూస్‌లైన్ నెట్‌వర్క్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రైతులు శనివారం ఆందోళనలు నిర్వహించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు వీణవంక-కరీంనగర్ రహదారిపై ధర్నా చేశారు. రామడుగు మండలం వెదిరలో, కోరుట్ల మండలం యెఖీన్‌పూర్‌లో రైతులు ధర్నా, రాస్తారోకో చేశారు. అకాల వర్షాలకు నీటిపాలైన వరితో పాటు తడిసిన విత్తన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని మానకొండూర్ మండలం చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామాల రైతులు గట్టుదుద్దెనపల్లిలోని సీడ్ గోదాం ఎదుట ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం గ్రామంలోని కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు రాస్తారోకో చేపట్టారు.
 
 ఆగిన అన్నదాత గుండె
 
 అకాల వర్షంతో జరిగిన నష్టానికి ఇద్దరు రైతులు గుండె  ఆగి మరణించారు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రా మంలో కొండ వెంకటయ్య(65)కు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ రబీలో మరో ఎకరం కౌలుకు తీసుకుని వరి, పసుపు  వేశాడు. శుక్రవారం కురిసిన అకాల వర్షం వరి మెదలను, పసుపును తడిపేసింది. శనివారం వాటిని చూసి వెంకటయ్య తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో కుప్పకూలాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన గంకిడి మల్లారెడ్డి(65) తనకున్న రెండెకరాల్లో వరి  ధాన్యాన్ని పొలం వద్ద కల్లంలో ఆరబోయగా శుక్రవారం కురిసిన వర్షానికి తడిసింది. దీంతో మనోవేదనతో గుండె ఆగి చనిపోయాడు.

మరిన్ని వార్తలు