వెనామీ రైతు విలవిల

21 Jun, 2014 02:42 IST|Sakshi
వెనామీ రైతు విలవిల

 సాక్షి, ఒంగోలు/ వేటపాలెం: ఒకనాడు సిరులు కురిపించిన వెనామీ రొయ్య ప్రస్తుతం రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. అధిక పెట్టుబడితో రంగంలోకి దిగిన రైతుకు కనీస ఖర్చులు కూడా రాకుండా చేస్తోంది. వ్యవసాయంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న అనేక మంది రైతులు ఆ నష్టాలను పూడ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ రంగంలోకి దిగి చేతులు కాల్చుకున్నారు.

చివరకు వాటిని సాగు చేయలేక చెరువులను ఖాళీగా  వదిలేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఖాళీ గుంటలు రైతు నష్టాలకు సాక్ష్యంగా నిలిచాయి. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతితో జిల్లాలో 12 హేచరీలు రొయ్య పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నాయి.  ప్రస్తుతం జిల్లాలో మూడు వేల హెక్టార్లలో దాదాపు 1500 మంది రైతులు వెనామీ రొయ్యను అధికారికంగా సాగు చేస్తున్నారు. మరో 500 హెక్టార్లలో అనధికారికంగా సాగవుతోంది.
 
 ఆటుపోట్లు...

 వెనామీ రొయ్య రైతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. చెరువులోకి పిల్లలను వదిలే క్రమం నుంచి వాటిని హార్వెస్టింగ్ చేసే వరకు భరించాల్సిన ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడం, దిగుబడులు మాత్రం పూర్తిగా పడిపోవడంతో ఆక్వారైతుల పరిస్థితి దయనీయమైంది.  
 
 భారీగా పెరిగిన పెట్టుబడులు..

 రొయ్యల చెరువుల లీజులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఎకరా లక్షరూపాయలు పలకగా ప్రస్తుతం వేసవి పంటలు లాభాలు వస్తాయనే నమ్మకంతో లీజులు ఎకరాకి రూ.1.80 లక్షలు పెట్టి చెరువులు చేజిక్కించుకున్నారు. దీంతో పాటు రొయ్యపిల్లలు ధరలు 50 శాతం పెరిగాయి.
 
 =    జనవరిలో రొయ్యపిల్ల ఖరీదు 40 పైసలు పలకగా ప్రస్తుతం 80 పైసలు పెరిగింది. వీటితో రొయ్యలకు అందించే దాణా ధరలు టన్నుకు రూ.6 వేల పెరిగాయి. గత ఏడాది టన్ను దాణా రూ.60 వేలు పలకగా ప్రస్తుతం రూ.66 పెరిగింది.
 =    రొయ్యలకు వాడే మందులు 25 శాతం పెరిగాయి.
 =    హెక్టారు సాగుకు దాదాపు రూ.12 లక్షలు పెట్టుబడి పెడుతుండగా, దిగుబడులు తగ్గి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
 
 దిగుబడిపై ఉష్ణోగ్రతల ప్రభావం:
 =    జిల్లాలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతలు కూడా వెనామీ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎకరా చెరువులో లక్ష పిల్లల వెనామీ సీడ్ పోస్తే.. అవి 40 కౌంట్ సైజ్‌కు వచ్చేసరికి 50 శాతం మాత్రమే మిగులుతున్నాయి. మిగతా సీడ్ ఎదుగుదల లేకుండానే వృథా అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేని వెనామీ రొయ్య 15 గ్రాములు బరువు పెరిగేసరికి చనిపోతున్నాయి. వాటిని బతికించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
 
 వేసవి సాగును మార్చి నెలలో దాదాపు 20 శాతం మంది ప్రారంభించారు.  ప్రస్తుతం సాగు ప్రారంభించిన వాటిల్లో 80 శాతం చెరువుల్లోని రొయ్యలు వైరస్ బారిన పడ్డాయి. ఎండవేడి విపరీతంగా పెరిగిపోవడం వంటి వాతావరణ మార్పులతో పాటు రొయ్యపిల్లల ఎన్నికల్లో తేడాల కారణంగా అవి తక్కువ కాలంలోనే వైరస్‌బారిన పడుతున్నాయి.
 
 పడిపోయిన రొయ్యల ధరలు..
 వర్షాకాలంతో పోలిస్తే రొయ్యల ధరలు భారీగా పడిపోయాయి. జనవరి నెలలో 30 కౌంటు రొయ్యలు ధర కిలో రూ.660 పలకగా ప్రస్తుతం అదే రకం రొయ్యల ధరలు రూ.500 పడిపోయింది. 40 కౌంటు రొయ్యలు జనవరిలో రూ.560 ఉంది. ప్రస్తుతం అదే రకం రూ.370కి తగ్గింది. 50 కౌంటు రకం జనవరిలో రూ.450 ఉంది. ప్రస్తుతం అదే రకం రూ.300 కు దిగజారింది.
 
 రైతులను పీడిస్తున్న కరెంటు కోతలు...
 
 =    అప్రకటిత కరెంటు కోతలతో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. కరెంటు కోతల కారణంగా డీజిల్ ఇంజన్‌లను వినియోగిస్తున్నారు. దీంతో ఖర్చు భారీగా పెరిగిపోయింది.
 =    రైతులకు క రెంటుకి యూనిట్‌కి రూ.6 ఖర్చు కాగా అదే డీజిల్ వాడకంతో రూ.19 ఖర్చు చేయాల్సి వస్తోంది.  ఈ వేసవిలో ఆక్వారైతులు భారీ నష్టాలు చవిచూశారు.  
 =    ఆయిల్ ఇంజిన్లు పెట్టుకోవడం, జనరేటర్ల సాయంతో ఒక్కో హెక్టారుకు రూ.2.50 లక్షలు వెచ్చించే పరిస్థితి వచ్చింది.
 =    ఆక్వా రంగాన్ని కూడా వ్యవసాయం కింద పరిగణించి విద్యుత్ టారిఫ్ తగ్గిస్తే కొంతమేర రైతులు తట్టుకోగలుగుతారనే అభిప్రాయం వినిపిస్తోంది. అలాకాని పక్షంలో వ్యవసాయ రైతు మాదిరిగానే భవిష్యత్‌లో వెనామీ రైతులు కూడా అప్పుల బాధతో ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం పొంచిఉందని రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు