వరి మునిగి..కొబ్బరి ఒరిగి..

27 Nov, 2013 01:49 IST|Sakshi
వరి మునిగి..కొబ్బరి ఒరిగి..

అమలాపురం, న్యూస్‌లైన్ :  హెలెన్ తుపానుకు వరి పంట నష్టపోయిన రైతులు కొంతమంది అయితే.. కొబ్బరి పంట నష్టపోయింది మరికొందరు. కాని తీర ప్రాంత మండలాల్లో వందల మంది రైతులు అటు వరి, ఇటు కొబ్బరి పంటలు సైతం ఒకేసారి దెబ్బతినడంతో రెండువిధాల నష్టపోయి లబోదిబోమంటున్నారు. జిల్లాలో కోనసీమతోపాటు తీర ప్రాంత మండల్లాలో వరి రైతులు తమ పొలాల వద్ద ఉండే కమతాలు, నూర్పిడులు చేసే కళ్లాలు, చేలగట్ల మీద కొబ్బరి చెట్లను పెంచుకుంటారు. ఇలా పెంచిన చెట్ల నుంచి వచ్చే ఆదాయం రైతులకు ‘వేడి నీళ్లకు చన్నీళ్లుగా’ ఉండేది.

ఎకరా కొబ్బరి తోటలో 60 నుంచి 80 చెట్లు వేయగా, ఎకరా వరి చేను చుట్టూ సుమారు 40 నుంచి 50 చెట్ల వరకూ వేస్తూంటారు. తోటల్లో మాదిరిగా ఎనిమిది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల పొడవుకు ఒకటి చొప్పున కాకుండా గట్ల మీద చెట్లు పక్కపక్కనే వేస్తూంటారు. కొబ్బరి తోటలు తక్కువగా ఉండే తీర ప్రాంత మండలాల్లోని వరి పొలాల్లో తప్పనిసరిగా గట్ల మీద చెట్లు పెంచుతూంటారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న తాళ్లరేవు, కాకినాడ రూరల్,  కరప, పిఠాపురం, గొల్లప్రోలు, తుని, తొండంగి, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి, అమలాపురం మండలాల్లో వరి చేల చుట్టూ కొబ్బరి చెట్లను పెంచుతూంటారు. సుమారు 1.20 లక్షల ఎకరాల వరి చేల చుట్టూ, కమతాల చుట్టూ కొబ్బరి సాగు చేస్తున్నారని అంచనా. ఎకరాకు 40 నుంచి 50కి తక్కువ కాకుండా చెట్లు ఉండే అవకాశమున్నందున రైతుకు సాలీనా మూడు వేలకు తక్కువ కాకుండా కొబ్బరి కాయల దిగుబడి వస్తుంది.

కొబ్బరికాయ సగటున రూ.4 ధర కడితే రైతుకు ఏడాదికి రూ.12 వేల వరకూ వచ్చేది. వరి రైతులకు ఇది అదనపు ఆదాయంగా ఉండేది. గడచిన ఐదేళ్ల కాలంలో నాలుగుసార్లు ఖరీఫ్ దెబ్బతిన్నా రైతులకు కొబ్బరిపై వచ్చే ఆదాయంతో కనీసం ఇల్లు గడిచేది. ఖరీఫ్ నష్టం రబీలో పూడ్చగా, మూడో పంట అపరాలు లేకపోవడంతో రైతులకు కొబ్బరి ఆదాయమే మిగిలేది. కౌలుదారులకు కొబ్బరి ఆదాయం చేయూతనిస్తుంది.
 హెలెన్ తుపానువల్ల గట్ల మీద చెట్లకు ఎక్కువ నష్టం వాటిల్లింది. తోటలతో పోల్చుకుంటే గట్ల మీద చెట్లే ఎక్కువగా దెబ్బతిన్నాయి. తోటల్లో చెట్లు గుబురుగా ఉండడం వల్ల గాలుల తీవ్రత నేరుగా పడని కారణంగా నష్టం తక్కువగా ఉంది. పొలాల గట్ల మీద చెట్లకు పెనుగాలులు నేరుగా తగలడంతో ఎక్కువ చెట్లు విరిగిపోయాయి. పైగా తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీరప్రాంత మండలాల్లో పెద్ద సంఖ్యలో గట్ల మీద పెంచిన చెట్లకు ఎక్కువ నష్టం వాటిల్లింది. తీరాన్ని ఆనుకుని చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులు సైతం కొబ్బరి చెట్లను ఎక్కువగా పెంచుతుంటారు. ఇటువంటిచోట్ల కూడా చెట్లు పడిపోయాయి.

 కొబ్బరి తోటల్లో ఎకరాకు మూడు చెట్ల వరకూ పడిపోగా, పొలంగట్ల మీద ఎకరాకు ఐదు చెట్లు పడిపోయినట్టు అంచనా. జిల్లాలో తుపాను ప్రభావంతో 80 వేల కొబ్బరి చెట్లు పడిపోయాయని అంచనా కాగా, దీనిలో 50 వేల వరకూ చెట్లు గట్లు, కళ్లాల్లోవి కావడం గమనార్హం. పెనుగాలులకు కొబ్బరి చెట్లు మొవ్వులు విరగడం, ఆకులు, పిందెలు, బొండాలు రాలిపోవడం వల్ల దిగుబడిపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కురిసిన భారీ వర్షాలకు అటు వరి పంట మొత్తం పోగా, ఇటు కొబ్బరి చెట్లు నేలకొరిగి వచ్చే అదనపు ఆదాయం కూడా పోవడంతో తీర ప్రాంత మండలాల రైతులు రెండు విధాలుగా నష్టపోయినట్టయింది.

మరిన్ని వార్తలు