మాఫీలాగే మమ!

27 Feb, 2017 01:11 IST|Sakshi
మాఫీలాగే మమ!

నిరుద్యోగ భృతిపై అధికార పార్టీ ఎత్తుగడ...
టీడీపీ పొలిట్‌బ్యూరోలో జగన్‌ లేఖ ప్రకంపనలు

ఏదో ఒకటి ప్రకటించకపోతే జనంలో తిరగలేం..
వ్యతిరేకత పెరుగుతుండడంపై నేతల్లో భయం
అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేమని నేతల ఆందోళన
ఇస్తున్నట్లు ప్రకటించి రుణమాఫీలా మమ అనిపించేద్దామని నిర్ణయం
ప్రతిపక్షానికి మైలేజీ దక్కకుండా ప్రచారం చేయాలని అధినేత నిర్దేశం


సాక్షి, అమరావతి :  ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖతో అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కలకలం రేగింది. ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం. జగన్‌ లేఖ నేపథ్యంలో ఉపాథి కల్పన, నిరుద్యోగ భృతి అంశాలపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోందని సమావేశంలో పలువురు మంత్రులు, నేతలు చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. దీనిపై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే జనంలో తిరగలేమని పలువురు నేతలు భయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

‘జాబు కావాలంటే బాబు రావాలి’, ‘ఇంటికో ఉద్యోగం ఇస్తాం’, ‘ఉద్యోగం కల్పించేవరకు నెలనెలా రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేయడం పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని మెజారిటీ సభ్యులు వివరించారు. ఉద్యోగాలు కల్పించకపోగా... ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున దోహదపడే ప్రత్యేకహోదా సాధన విషయంలోనూ మనం విఫలంకావడంపై నిరుద్యోగ యువత రగిలిపోతోందని వారు వివరించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాగ్దానాలు చేసి, మేనిఫెస్టోలోనూ ప్రస్తావించి ఇపుడు మమ్మల్ని మోసం చేస్తారా అని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నేతలు వివరించారని తెలిసింది.

ఈ అంశంపై ఏదో ఒక ఊరడింపు చర్య తీసుకోవాలని, లేకపోతే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడి సభ జరగడం దాదాపు కష్టమౌతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పదేళ్లు సరిపోదు, పదిహేనేళ్లు కావాలని మనమే డిమాండ్‌ చేయడం, ఇపుడు మనమే ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానిస్తుండడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయని, ప్యాకేజీ గురించి ఎన్ని చెప్పినా జనం నమ్మడం లేదని పలువురు నేతలు వివరించినట్లు తెలుస్తోంది.