ఏడాది కష్టం బూడిదపాలు

1 Jan, 2020 11:34 IST|Sakshi
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది

కంబకాయలో భారీ అగ్ని ప్రమాదం

560 బస్తాల ధాన్యం దగ్ధం

కాలిబూడిదైన వరి గడ్డి కుప్పలు   

శ్రీకాకుళం, నరసన్నపేట: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. ఆ రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మండలంలోని కంబకాయలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది రైతులకు చెందిన సుమారు 560 బస్తాల ధాన్యం, 50 ఎకరాలకు చెందిన వరి గడ్డి కుప్పలు కాలిపోయాయి. పండిన పంటను కళ్లాలకు తీసుకువచ్చి నూర్పుడిలు చేశారు. మిల్లర్లు వచ్చి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది.

రైతులు వడ్డాది పరశురాం, పాగోటి వెంకటరావు, తంగి అప్పన్న, రేగు కృష్ణారావు, నాయుడు నరసమ్మ, పాగోటి పరశురాం, పాగోటి సూర్యారావులకు చెందిన ధాన్యం, గడ్డి కుప్పలు కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. గడ్డి కుప్పల మధ్య ధాన్యం బస్తాలు ఉండటంతో వాటిని బయటకు తీసేందుకు వీలు లేకపోయిందన్నారు. వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇచ్చామన్నారు. సిబ్బంది వచ్చే సరికి ఆలస్యం అయిందని, వచ్చిన తర్వాత కూడా నీరు అందుబాటులో లేక మంటలను ఆర్పడంలో జాప్యం జరిగిందని గ్రామస్తులు ప్రభాకరరావు, కాలిదాసు తెలిపారు. ప్రమాదంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని, బీమా వర్తించేలా చూడాలని గ్రామస్తులు కోరారు. 

మరిన్ని వార్తలు