అగ్ని ప్రమాదంలో రూ.20 లక్షల నగదు దగ్ధం

17 Nov, 2018 08:52 IST|Sakshi
కాలిపోయిన నగదు చూసి రోదిస్తున్న కనకమ్మ

విశాఖపట్నం, ఆనందపురం (భీమిలి) : మండలంలోని గంభీరం పంచాయతీ, కల్లివానిపాలెం సమీపంలోని కోమటిపాలెంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో పూరిపాక దగ్ధం కాగా రూ.20 లక్షల నగదు కాలి బూడిదయింది. దీంతో బాధిత కుటుంబం కట్టు బట్టలతో రోడ్డున పడింది. కూలిపనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న కంప కనకమ్మ, ఆమె కుమార్తె కొండమ్మలు స్థానికంగా పూరిపాకలో నివసిస్తున్నారు. ఇటీవల తమకు పూర్వీ కుల నుంచి వారసత్వంగా లభించిన 30 సెంట్లు స్థలాన్ని విక్రయించుకోగా వచ్చిన సుమారు రూ.20 లక్షలను పాకలో ఉన్న ఇనుప బీరువాలో భద్రపరిచారు.

ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం కనకమ్మ వంట చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన కనకమ్మ బయటకు పరుగులు తీసింది. మంటలు మరింత ఉధృతమై మొత్తం పాక అంతా కాలిపోగా బీరువాలో ఉన్న నగదు కాలి బూడిదయింది. దీంతో కనకమ్మ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సంఘటనా స్థలాని కి ఎస్‌ఐ ఎన్‌.గణేష్‌ చేరుకొని విచారించారు. తాజా మాజీ సర్పంచ్‌ బోయి అరుణ కుమారి, స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఉప్పాడ రామిరెడ్డిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

మరిన్ని వార్తలు