బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

12 Nov, 2023 17:31 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 

దీపావళి పండగ వేళ ముందస్తు అనుమతితోనే గోపాల్‌బాగ్ ప్రాంతంలో బాణాసంచా దుకాణాలు వెలిశాయి. పండగ కావడంతో మార్కెట్‌ జనంతో కిటకిటలాడుతోంది. మొదట ఓ షాప్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న ఏడు దుకాణాలకు ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరగడంతో జనం పరుగులు పెట్టారు. ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ షాక్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.    

క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంటల్లో పలు వాహనాలు కూడా కాలిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచా అమ్మకాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ వాసులకు అలర్ట్!

మరిన్ని వార్తలు