వైజాగా... చాలదా

15 Jun, 2014 02:07 IST|Sakshi
వైజాగా... చాలదా
  • విశాఖలో రాజధాని ఏర్పాటుకు అందుబాటులో 15వేల ఎకరాలు
  •  సీఎం దృష్టికి తీసుకువెళ్లిన శివరామకృష్ణన్ కమిటీ
  •  గుంటూరువైపు ప్రభుత్వం మొగ్గుతో మనకొచ్చే అవకాశం తక్కువే
  •  బదులుగా ఈ భూముల్లో భారీగా కొత్త ప్రాజెక్టులొచ్చే వీలు
  •  ఐఐటీ,ఐటీఐఆర్ ఏదో ఒకటి దక్కే అవకాశం
  • వేలాది ఎకరాల స్థలాల లభ్యత ఉన్నా నవ్యాంధ్రకు రాజధానిగా విశాఖ అవతరించేదీ లేనిదీ ఇంకా రూఢి కాలేదు. రాజమండ్రి,గుంటూరు ప్రాంతాల్లో ఇక్కడి కన్నా తక్కువ భూములున్నటు తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలో రాజధానికి గల అవకాశాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. రాజ ధాని హోదా మాట ఎలా ఉన్నాఐఐటీ, ఐటీఐఆర్ ఏదో ఒక భారీ ప్రాజెక్టు దక్కే అవకాశం  ఉంది.
     
    సాక్షి, విశాఖపట్నం : విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ముమ్మరమవుతోంది. ఇప్పటికే విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని రావచ్చని సూచనప్రాయంగా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఇంకా ఖరారు కాకపోవడంతో విశాఖకు ఆ అవకాశం వస్తుందనే కొద్దిపాటి ఆశలు కలుగుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశమైన శివరామకృష్ణన్ కమిటీ విశాఖలో రాజధానికి గల అవకాశాలను కూడా వివరించింది. కమిటీ రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాజధానికి అనువైన భూముల వివరాలు కూడా గతంలో ఆరా తీసింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు రప్పించుకుంది. దాని ప్రకారం విశాఖలో రాజధాని ఏర్పాటుకు 15 వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నట్లు కమిటీ వివరించింది.

    విశాఖలో అనేక రకాల ప్రాథమిక సౌకర్యాలు ఇప్పటికే ఉండడం, ప్రకృతి విపత్తుల భయం కూడా ఈ ప్రాంతానికి లేకపోవడం విశాఖకు మంచి అవకాశంగా ఉన్నట్లు ఈ కమిటీ అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని శనివారం సీఎంకు వివరించింది. అదే రాజమండ్రి,గుంటూరు ప్రాంతాల్లో విశాఖ కన్నా తక్కువ భూములున్నటు తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలో రాజధానికి గల అవకాశాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.   

    రాజధాని ఎంపిక తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉన్నందున, ఇప్పటికే గుంటూరువైపు ఆసక్తి చూపుతుండడంతో విశాఖ వైపు మొగ్గు చూపకపోవచ్చని స్పష్టమవుతోంది. విశాఖలో ఇప్పటికే రద్దీవాతావరణం, కాలుష్యం, దానికితోడు నగరం నుంచి గ్రామీణ ప్రాంతం వరకు తీరం వెంట పారిశ్రామిక కారిడార్ వస్తోన్న నేపథ్యంలో రాజధానికి అనువైన ప్రాంతంగా పరిగణించడం లేదు.  

    విశాఖలో భూముల లభ్యత భారీగా ఉన్నట్లు ఇప్పటికే కలెక్టర్ కూడా వివరాలు సిద్ధం చేశారు. ఒకవేళ ప్రభుత్వం విశాఖవైపు మొగ్గుచూపకపోతే ఈ భూముల్లో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతంలో ఏయే ప్రాజెక్టులు తీసుకు రావచ్చనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
     
    కేబినెట్‌లో కదలిక
     
    విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటీ,ఐఐఎం,గిరిజన యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం ఉంది. వీటిలో కొన్నింటిని విశాఖలో అందుబాటులో ఉన్న భూముల్లో స్థాపించవచ్చని తెలుస్తోంది.  కేబినేట్ సమావేశానికి విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవుటర్ రింగ్ రోడ్డు, విద్యా,వైద్య,పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధితోపాటు ఐటీఐఆర్ ఏర్పాటుకు విశాఖలో ఖాళీ భూములపై మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. దీంతో రాజధాని రాకపోయినా కొత్త ప్రాజెక్టులు ఇక్కడకు వచ్చే వీలుంది.  

    ఆంధ్రలో ఐఐటీ ఏర్పాటుపై ఈనెల 17న పురపాలకశాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో మరోసారి చర్చించనున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా కలెక్టర్‌తో చర్చలు కూడా జరిపారు. ఖాళీ భూముల వివరాలు కోరారు. ఒక వేళ రాజధాని రాకపోతే ఇక్కడ కచ్చితంగా కేంద్రం మంజూరు చేసే ఐఐటీ తీసుకు రావచ్చు.   

    కేంద్రం హైదరాబాద్‌కు 2.19లక్షల కోట్లతో ఇప్పటికే ఐటీఆర్ ప్రకటించింది. ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో విశాఖలో రూ.50వేల కోట్లతో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి వెల్లడించింది.   నగరంతోపాటు గ్రామీణ ప్రాంతంలో కూడా ఐటీఐఆర్‌కు కావలసిన 10 వేల ఎకరాల భూముల లభ్యతపై సర్వే నిర్వహించింది.  ప్రస్తుతం విశాఖలో ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రాథమిక పనులు పది నెలల నుంచి నిలిచిపోయాయి. ఇప్పుడు భూముల లభ్యత ఎలాగూ ఉంది కాబట్టి ఏదో ఒక కీలక ప్రాజెక్టు విశాఖకు వేగంగానే దక్కే అవకాశం ఉంది.
     

మరిన్ని వార్తలు